అమలాపురంలోని వెంకటరమణ థియేటర్‌లో “కోర్ట్” సినిమా టికెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ విషయంపై అందిన సమాచారం ఆధారంగా, రీజనల్ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో) కె. మాధవి, మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో) అశోక్ నేతృత్వంలో అధికారుల బృందం థియేటర్‌లో తనిఖీలు నిర్వహించింది. ఇక ఈ తనిఖీల సందర్భంగా, “కోర్ట్” సినిమా టికెట్ ధర నిబంధనల ప్రకారం 110 రూపాయలుగా ఉండాల్సి ఉండగా, థియేటర్ యాజమాన్యం దానిని 150 రూపాయలకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
READ NORE: RCB Unbox Event: రజత్ పాటిదార్‌పై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
ఈ అక్రమ విక్రయాలు నిర్ధారణ అయిన నేపథ్యంలో, రెవెన్యూ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. థియేటర్ లైసెన్స్‌ను రెన్యువల్ కూడా చేయలేదని కూడా ఆర్డీవో కె. మాధవి గమనించారు. ఈ ఉల్లంఘనల దృష్ట్యా, విచారణ పూర్తయ్యే వరకు “కోర్ట్” సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని ఆర్డీవో కె. మాధవి ఆదేశాలు జారీ చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా టికెట్ల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం విధించిన నిబంధనలను పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇక ప్రేక్షకులకు న్యాయమైన ధరల్లో టికెట్లు అందేలా చేయడంతో పాటు, థియేటర్ యాజమాన్యాలు చట్టబద్ధంగా నడుచుకోవాలని తనిఖీలతో సందేశం ఇచ్చినట్టయింది. విచారణ పూర్తయిన తర్వాత థియేటర్‌పై తదుపరి చర్యలు నిర్ణయించబడతాయని అధికారులు తెలిపారు.