పౌరాణికాలే మన భక్తి ప్రపత్తులకు బీజం వేసే సాధనాలు. అలాంటి గాథలను అంతే భక్తిభావంతో పూజించేవారూ ఉన్నారు. తమ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఎవరు ప్రవర్తించినా జనం సహించరు. ఇప్పుడు ఈ పురాణమంతా ఎందుకంటారా? ఆదికావ్యంగా వెలుగుతున్న ‘రామాయణం’ ఆధారంగా దర్శకుడు ఓమ్ రౌత్ తెరకెక్కిస్తోన్న ‘ఆదిపురుష్’ లో రఘురామునికి మీసాలు పెట్టి చూపించడమే భక్తులు సహించలేకున్నారు. అసలు ఓమ్ రౌత్ ఈ విధంగా ఎందుకు ఆలోచించారనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా రామజన్మభూమి అయోధ్యలో ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసి భక్తుల మనోభావాలను కించపరిచారనీ అంటున్నారు.
పౌరాణికాలు తెరకెక్కించడంలో తెలుగువారు మేటి అనిపించుకున్నారు. అందువల్లే రామానందసాగర్ వంటి దిగ్దర్శకుడు తన ‘రామాయణం’ సీరియల్ రూపొందించే సమయంలో పౌరాణిక నటబ్రహ్మగా పేరొందిన యన్టీఆర్ ను సంప్రదించారు. ఆయన సలహాలు, సూచనలు తీసుకొని గెటప్స్ రూపొందించారు రామానందసాగర్. ఆ రోజుల్లో ‘రామాయణం’ సీరియల్ అఖిల భారతావనినీ అలరించింది. అందులో శ్రీరామునిగా నటించిన అరుణ్ గోవిల్, సీతగా అభినయించిన దీపిక జేజేలు అందుకున్నారు. అంతకు ముందు అనేక హిందీ పౌరాణిక చిత్రాలలోనూ శ్రీరామునికి ఎవరూ ఎక్కడా మీసాలు పెట్టిన దాఖలాలు లేవు. ఒకవేళ శ్రీరాముడు భక్తులను పరీక్షించడానికో, రక్షించడానికో మారువేషంలో వచ్చాడు అన్న సన్నివేశం ఉంటే, అందులో రామునికి మీసాలు పెట్టారే తప్ప సాక్షాత్తు అయోధ్య రాముని గెటప్ లో ఉన్నప్పుడు ఆ సాహసం ఎవరూ చేయలేదు. మరి ఓమ్ రౌత్ ఈ సాహసం చేయడానికి కారణాలేంటో ఆయనే వివరించాల్సిన సమయం ఆసన్నమవుతోంది.
త్రీడీ యానిమేషన్ లో ‘ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్’తో ఈ ‘ఆదిపురుష్’ను ఎందుకు రూపొందించాలని భావించారో కూడా అర్థం కావడం లేదు. ఆ మోషన్ క్యాప్చర్ బదులుగా నటీనటులను తగిన గెటప్ లో తెరపై ఆవిష్కరించవచ్చు కదా అనీ పరిశీలకులు అంటున్నారు. రామునికి మీసాలు పెట్టడమే ఓ నేరంగా జనం భావిస్తూ ఉంటే, అసలైన పాత్రలకు బదులుగా మోషన్ క్యాప్చర్ లో చూపించడం కూడా అంతగా ఆకట్టుకోవడం లేదు. మన దేశంలో ‘ఫోటో రియలిస్టిక్ మోషన్ క్యాప్చర్’ టెక్నిక్ తో తొలిసారి రూపొందిన చిత్రం రజనీకాంత్ ‘కొచడయ్యాన్’. ఇది ఘోరపరాజయం పాలయింది. పరమపురుషుని పాత్రనే ఇష్టం వచ్చినట్టుగా చిత్రీకరించిన ‘ఆదిపురుష్’పైనా భక్తజనం ఆగ్రహంతో ఉన్నారు. మరి ‘ఆదిపురుష్’ సంక్రాంతి సంబరాల్లో ఏలాంటి పరిస్థితులు ఎదుర్కొంటుందో చూడాలి.