కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ విచారణపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. దేశ రాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలుపుతున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన ఆందోళనల్లో ఢిల్లీ పోలీసులు ఎంపీలపై అనుచితంగా వ్యవహించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఎంపీలని చూడకుండా లాఠీ ఛార్జ్ చేశారని కాంగ్రెస్ ఎంపీలు, అగ్రనేతలు పి.చిదంబరం, మల్లిఖార్జున్ ఖర్గేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని విచారించిన తీరు, కాంగ్రెస్ ఎంపీల పట్ల ఢిల్లీ పోలీసులు అనుసరించిన వైఖరిపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఫిర్యాదు కూడా చేశారన్నారు.
ఎంపీలను అరెస్ట్ చేస్తే చట్టసభల అధిపతులకు తెలియజేయాలని కాంగ్రెస్ అగ్రనేత పి.చిదంబరం అన్నారు. ఎంపీలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేయకుండా నిర్బంధించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లలో అర్ధరాత్రి వరకు ఎంపీలను ఉంచి వేధించారని.. వారిని అవమానించారని ఆయన మండిపడ్డారు. సభా హక్కుల సంఘం ఈ విషయంపై విచారణ చేయాలని ఆయన కోరారు. పార్లమెంట్ సభ్యుల హక్కులకు భంగం కలిగిందన్నారు. పోలీసుల జులుంపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడికి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. తమిళనాడుకు చెందిన ఎంపీ జోతిమణి, ఢిల్లీ పోలీసులపై చేసిన ఆరోపణలు వైరల్ అవుతున్నాయి. తమిళనాడు కరూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ జోతిమణి నిరసనలు తెలుపుతున్న సందర్భంలో ఢిల్లీ పోలీసులు దారుణంగా వ్యవహరించారని ఆమె ట్విటర్‌లో వీడియోను పోస్ట్ చేసింది. తన బట్టలు చిరిగేలా ప్రవర్తించడంతో పాటు కనీసం తాగడానికి నీరు అందించాలని అడిగినా ఒప్పుకోలేదని.. బయట షాపుల నుంచి వాటర్ బాటిల్స్ కొందాం అని అనుకున్నా.. నీరు ఇవ్వొద్దని షాపు యజమానులను ఆదేశించారని, బస్సులో నాతో పాటు 7-8 మంది మహిళా ఎంపీలు ఉన్నారని ఆమె వీడియో తీసి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Congress: మహిళా ఎంపీ బట్టలు చింపేయడం దారుణం.. శశిథరూర్ ట్వీట్
అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ట్వీట్ చేశారు. ‘‘ ఏ ప్రజాస్వామ్యంలో అయినా ఇలా చేయడం దారుణం అని.. మహిళా నిరసనకారులతో ఇలా వ్యవహరించడం భారతీయ మర్యాదను ఉల్లంఘించడమే అని.. ఈ విషయంలో ఢిల్లీ పోలీసులు ప్రవర్తనను ఖండిస్తున్నానని, స్పీకర్ ఓం బిర్లా దీనిపై చర్య తీసుకోవాలని ట్వీట్ చేశారు.