Congress: ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వేటలో నిమగ్నమైంది. నేటి(బుధవారం) నుంచి అసెంబ్లీ, ఎంపీ స్థానాలకు పోటీ చేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు సిద్ధమైంది. నేటి నుంచి విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఉదయం 11 గంటలకు మొదటి అప్లికేషన్‌ను మాణిక్కం ఠాకూర్ ఇవ్వనున్నారు.
Read Also: Vijayawada: బెజవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్
ఏపీ కాంగ్రెస్‌లో చేరిన వారికి కూడా అప్లికేషన్లు ఇవ్వనున్నారు. ఏపీ కాంగ్రెస్ సభ్యత్వమే అభ్యర్ధి మొదటి అర్హతగా ప్రకటించారు. పూర్తి అర్హతల పరిశీలన అనంతరం అభ్యర్ధులను నిర్ణయిస్తామని ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ఏపీ కాంగ్రెస్ మాజీలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరాలని మాజీలకు ఇప్పటికే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల పిలుపునిచ్చింది. ఇప్పటికే మాజీలతో పాటు ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏపీసీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను నేరుగా కలిసి తమకు అవకాశం ఇవ్వాలని ఆశావహులు కోరుతున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీని బలోపేతం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగానే ఆమె ఈ నెల 23 నుంచి 9 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఆమె జిల్లాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు రెండు జిల్లాల్లో కోఆర్డినేషన్ సమావేశాలు నిర్వహించాలని తలపెట్టారు.