Congress: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో టికెట్ల లొల్లి నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ రెండవ జాబితా అభ్యర్థుల ప్రకటనతో అసమ్మతి నేతలు తెరపైకి వచ్చారు. మూడు నియోజకవర్గాల్లో అసమ్మతి స్వరం పెరుగుతోంది.
ముధోల్ నియోజకవర్గంలో టికెట్ చిచ్చు మొదలైంది. తనకు టికెట్ రాలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయకుమార్ రెడ్డి పార్టీ జెండాలు, కండువాలు, ఫ్లెక్లీలను తగులబెట్టారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా నిరాకరించిందని మనస్థాపానికి గురై కార్యకర్తలతో జెండాలకు నిప్పు పెట్టించి నిరసన వ్యక్తం చేశారు. వారం క్రితం పార్టీలో చేరిన నారాయణ రావు పాటిల్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తనకు టికెట్ రాలేదని జెండాలను తగలబెడుతున్నారు. కార్యాలయాలపై రెపరెపలాడిన హస్తం పార్టీ ఫ్లెక్లీలు, జెండాలకు ఇప్పుడు నిప్పు పెట్టారు. టికెట్ వస్తుందనే ఆశ నిరాశ కావడంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. జెండాలు తెంచి నిప్పుపెట్టి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడు సార్లు మోసం చేసిందంటూ ఆవేదనతో బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఆఖరికి వాహనాలపై ఉన్న కాంగ్రెస్ ఫోటోలను కూడా కార్యకర్తలు తొలగించారు.
Also Read: CM KCR: కామారెడ్డిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్
ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టికెట్ రాకపోవడంతో ప్యారాచ్యూట్ హాటావో అంటూ టికెట్ రాని నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ చిచ్చు చెలరేగింది. ఆదివాసీలకు అన్యాయం చేశారంటూ టికెట్ ఆశించిన మర్సుకోల సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ అమ్ముకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి ఆమె భంగపడ్డారు. ఆదివాసీలతో సమావేశంలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ మోసం చేశారని ఆమె ఆరోపించారు. శ్యామ్ నాయక్ ఎలా గెలుస్తాడో చూస్తామని ఈ సందర్భంగా ఆదివాసీలు హెచ్చరించారు. శ్యాం నాయక్‌కు టికెట్ అమ్ముకున్నారని ఆదివాసీలు. తీవ్ర ఆరోపణలు చేశారు. తాను ఇంద్రవెల్లి సభకు 50 లక్షల వరకు ఖర్చు చేసానంటూ మరో నాయకుడు గణేష్ రాథోడ్ ఆవేదన చెందారు. పార్టీ కోసం పనిచేసే వారికి కాకుండా అక్రమాలు చేసిన నాన్ లోకల్ వ్యక్తికి టికెట్ ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో స్థానికులకే టికెట్ ఇవ్వాలని మరో వర్గం నాయకులు డిమాండ్ చేశారు. వినోద్‌కు వ్యతిరేఖంగా మరో వర్గం నాయకులు. సమావేశం అయ్యారు.