GHMC: హైదరాబాద్ గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) లో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతుతో కలిసి 22 మంది కార్పొరేటర్లు స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమయ్యారు. రెండు రోజుల క్రితం, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమైన కాంగ్రెస్ కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్ ఇంకా ఫ్లోర్ లీడర్ తో అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పేర్లను మినహాయించి మిగతా 22 మంది పేర్లను టీపీసీసీ అధ్యక్షుడికి అందజేశారు.
ఈ సందర్బంగా, త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పేర్లు ప్రకటించిన తర్వాత, కాంగ్రెస్ కార్పొరేటర్లు జిహెచ్ఎంసిలో నామినేషన్లు దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే, కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరు మహిళా కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేశారు. మరో ముగ్గురు మహిళా కార్పొరేటర్లతో పాటు, ఇద్దరు పురుష కార్పొరేటర్లకు కూడా ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించే అవకాశం ఉందని సమాచారం. మహాలక్ష్మి గౌడ్ (హిమాయత్ నగర్), పుష్ప నగేష్ ( RC పురం ), బొంతు శ్రీదేవి (చర్లపల్లి), బాణోతు సుజాత (హస్తినాపురం), CN రెడ్డి (రెహ్మత్ నగర్), జగదీశ్వర్ గౌడ్ (మాదాపూర్), బాబా ఫసియుద్దీన్ (బోరబండ) లు కాంగ్రెస్ పార్టీ నుండి స్టాండింగ్ కమిటీ కి పోటీ చేసే అభ్యర్థులగా సమాచారం అందుతోంది.
Read Also: Champions Trophy 2025: పాకిస్తాన్‌లో భారత జెండా వివాదం.. కరాచీ స్టేడియం వీడియో వైరల్
ఇక, బీజేపీ కార్పొరేటర్లు తమ సంఖ్య బలం తక్కువగా ఉండటంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా తమ గెలిచే అవకాశం లేకపోవడంతో ఎన్నికలలో పోటీకి వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితిలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటే స్టాండింగ్ కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరగవచ్చని భావిస్తున్నారు. ఇలా, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠతో జరుగుతున్నాయి.