NTV Telugu Site icon

Cockfighting: అట్టహాసంగా భోగి వేడుకలు.. కాలు దువ్వుతున్న పందెం కోళ్లు..

Cockfighting

Cockfighting

Cockfighting: తెలుగులొగిళ్లలో భోగి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. తెల్లవారుజాము నుంచి భోగి మంటలు వేస్తున్నారు ప్రజలు.. ఈ వేడుకల్లో పలు చోట్ల సినిమా స్టార్లు, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు భాగస్వాములు అవుతున్నారు.. మరోవైపు.. సంక్రాంతి పండుగకు కోడి కాలుదువ్వుతోంది.. సంక్రాంతి బరిలో కాలుదువ్వేందుకు పందెంకోళ్లు సై అంటున్నాయి. బరిలో నిలిచేందుకు కొన్ని నెలల పాటు ప్రత్యేక శిక్షణ పొంది, రాటుదేలిన కోళ్లు తమ సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. మూడు రోజుల వేడుకలో ప్రత్యేకంగా నిలిచే కోడిపందేలను భారీగా నిర్వహించేందుకు బెట్టింగ్‌ బాబులు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు.

సంక్రాంతి పండుగ వేళ ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల నిర్వహణకు బరులు సిద్ధమయ్యాయి. ఒక్కో నియోజకవర్గ పరిధిలో పదుల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. ప్రతి ప్రధాన బరికి అనుబంధంగా మరో 10 చిన్నవి ఏర్పాటు చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని ఐ.పోలవరం మండలం మురమళ్లలో సుమారు 30 ఎకరాల లే అవుట్‌లో భారీ ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. రేయింబవళ్లూ పందేలు నిర్వహించేందుకు వీలుగా ఫ్లడ్‌ లైట్లు అమర్చారు. ప్రత్యేకంగా డ్రోన్లు, ఆధునిక కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షించనున్నారు. అతిథులకు సరికొత్త రుచులు అందించేలా ప్రత్యేకంగా వంట మనుషులను రప్పించారు. అమలాపురం పరిధిలోని ఎస్‌.యానాంలో సముద్ర తీరంలో నాలుగెకరాల నేలను సంక్రాంతి సంబరాల పేరిట చదును చేశారు. ఇక్కడ మూడు రోజులూ కోడి పందేలు నిర్వహిస్తారని ప్రచారం సాగుతోంది. కోనసీమలోని ఆత్రేయపురంలో పదిచోట్ల బరులు సిద్ధం చేశారు. కాకినాడ గ్రామీణంలోని నేమాం, సూర్యారావుపేటలో పెద్దబరులు ఏర్పాటయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని కడియం, గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లిలోనూ బరులు సిద్ధమవుతున్నాయి. కొన్నిచోట్ల కూటమిలోని ప్రధాన పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరు బయటపడుతోంది. మధ్యాహ్నం తర్వాత పందేల జోరు పెంచి మంగళవారం పెద్దఎత్తున నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. రూ.వందల కోట్లు చేతులు మారే అవకాశముంది.

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా ఇవాళ్టి నుంచే పందేలు వేసేలా నిర్వాహకులు సిద్ధమయ్యారు. భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో బరుల వద్ద విద్యుత్‌ దీపాలు, ఎల్‌ఈడీ తెరలు, ప్రత్యేక గ్యాలరీలతో సకల సదుపాయాలు సమకూర్చారు. పెదఅమిరం బరిలో మూడు రోజులకు వేర్వేరుగా ప్రవేశ పాసులు, భోజనం, అల్పాహారం టోకెన్లు ముద్రించారు. వీఐపీలు, సామాన్యులను వేర్వేరుగా లోపలికి పంపించేలా ప్రవేశ ద్వారాలను విభజించారు. పందేలకు ముందు టాస్‌ వేసేందుకు బంగారు నాణేలను సిద్ధం చేసినట్లు సమాచారం. తాడేపల్లిగూడెంలోని ఓ బరిలో సంక్రాంతి రోజున రూ.కోటి విలువైన పందెం వేసేందుకు సిద్ధమవుతున్నారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం, కంకిపాడు మండలం ఉప్పులూరు, ఈడుపుగల్లులో భారీగా బరులు వెలిశాయి. చుట్టూరా ఇనుప బద్దలు, కంచెలతోపాటు రేకుల షెడ్లు వేశారు. అంపాపురం బరిలో పేకాట ఆటగాళ్ల కోసం ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు.

కోడి పందానిరి సిద్ధం చేసే ఒక్కో పుంజు కోసం దాదాపు 30 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. పందెంలో బలంగా పోరాడేందుకు కోళ్లకు డ్రైప్రూట్స్‌తో పాటు ప్రత్యేక ఆహారాన్ని అందిస్తామని పెంపకందారులు చెబుతున్నారు. కోళ్లను కోనుగోలు చేసేందుకు ఉమ్మడి గోదావరి, గుంటూరు జిల్లాల నుంచి వస్తున్నారంటున్నారు పెంపకం దారులు.. బరిలో పందెం గెలిచేందుకు అధిక ధరలు వెచ్చించైనా కోళ్లను కొనుగోలు చేసేందుకు బెట్టింగ్‌ బాబులు వెనుకడుకు వేయడం లేదు. ఒక్కొ పుంజుకు 5 వేల రూపాయల నుంచి 2 లక్షల వరకూ ధర పలుకుతోంది. కొన్న పుంజు పందెం గెలిస్తే చాలు పేరుకు పేరు, డబ్బుకు డబ్బు వచ్చి పడుతుందంటున్నారు పందెం రాయుళ్లు.. రాష్ట్రంలో సంక్రాంతి పండగ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది కోడి పందేలు. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ పందేల కల్చర్.. ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందేలు.. ఇప్పుడు మంచి బిజినెస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చాలామంది కోళ్లను పెంచడం, వాటిని విక్రయించడం, బరులు నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు కూడబెడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

నిర్వాహకులు కోళ్ల పందెం కట్టినందుకు కొంత, గెలిచిన వారి నుంచి కొంత వాటా తీసుకుంటారు. అంతేకాకుండా బరుల వద్ద సైకిల్‌, టూవీలర్ పార్కింగ్ నుంచి మద్యం, ఇతర దుకాణదారుల వరకు పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. దీంతో పందేల పేరుతో సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.అతి తక్కువ రోజుల్లో కోట్లు రూపాయలు కూడబెట్టుకునే అవకాశం ఉండటంతో.. వివిధ జిల్లాల్లో ఈ సంస్కృతి పెరుగుతోంది. పండగ సంప్రదాయం పేరుతో పందేలు నిర్వహిస్తుండటంతో.. ఆపేవారు ఉండరని నిర్వాహకులు భావిస్తున్నారు. కోడి పందాలు చూసేందుకు, పందాలు కాయడానికి ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి సినీ నటులు, బడా వ్యాపారులు ఇప్పటికే గోదారి జిల్లాలకు చేరుకున్నారు.. కేవలం పండగ రోజుల్లోనే కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయనే టాక్ ఉంది. ఈ ఏడాది.. 12 నుంచి 15 వరకు నాలుగు రోజులు కోడి పందేల నిర్వహించడానికి ఏర్పాట్లు చకాచకా చేస్తున్నారు.

గతంలో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పందేలు ఉండేవి. ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ పందాల నిర్వహణకు బరులు సిద్ధం చేశారు. దీంతో పందెం కోళ్లకు బాగా డిమాండ్‌ పెరిగింది. కేవలం సంక్రాంతి కోసమే ప్రత్యేకంగా కోడి పుంజులను పెంచేవారు పెరిగారు. ఒక్కో పుంజు ధర రూ.25 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉందని పెంపకందారులు చెబుతున్నారు. కోడి పందాలపై ఆరంభంలో సీరియస్‌గా ఉన్న పోలీసులు.. నెమ్మదిగా సైలెంట్ అయ్యారని ఆరోపణలు వస్తున్నాయి.కొందరు నేతలు, పెద్దల నుంచి ఒత్తిడి రావడంతో.. ఇప్పుడు బరుల దగ్గర సెక్యూరిటీ ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Show comments