Cobra on Plane: ఎక్కడైనా పాము కనిపించిందంటే పరుగులు పెడతారు.. అమ్మో పాము అంటూ హడలిపోతారు.. కొన్నిసార్లు వాహనాల్లోనూ పాములు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి.. వెంటనే ఆ వాహనాన్ని ఆపి.. దిగిపోవడానికి అవకాశం ఉంది.. కానీ, గాల్లో ఎగురుతున్న ఓ విమానంలోని అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాక్ పిట్‌లోకి ప్రవేశించిన అత్యంత విషపూరితమైన కేప్ కోబ్రా ఏకంగా పైలట్ సీట్ పక్కన ప్రత్యక్షమైంది.. దీంతో ఆ పైలట్ హడలిపోయాడు.. కానీ, గందరగోళానికి గురికాలేదు.. ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో విమానంలో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో జరిగింది.
కాక్ పిట్‌లో పామును గమనించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యాడు.. సేఫ్‌గా విమానాన్ని ల్యాండ్ చేశాడు.. అయితే, అదేదో పెద్ద విమానం కాదు.. నలుగురు ప్రయాణికుతో వెళ్తున్న చిన్న విమానం.. ఏదైనా విమానమే కదా? వార్సెస్టర్ నుంచి నెల్సుప్రీట్‌కు ఈ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ తన వెనుక భాగంలో ఏదో కదులుతున్నట్టు గుర్తించాడు.. అతడికి నాగుపాము తన సీటు కింద కనిపించింది. గాల్లో విమానం ఎగురుతోన్న సమయంలో.. పామును చూసిన షాక్ తిన్నాడు.. అయితే, సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. పాము ఉన్న విషయాన్ని ముందుగా గ్రౌండ్ కంట్రోల్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు.. ఏటీసీ సూచనలతో విమానాన్ని జోహన్నెస్‌బర్గ్‌లో అత్యవసరంగా దింపివేశాడు.. దీంతో.. అంతా సురక్షితంగా బయటపడ్డారు.. ఇక, ఆ తర్వాత విమానంలో తనిఖీలు చేయగా.. పైలట్ సీటు కింద పామును గుర్తించారు.
ఆ ఘటనపై పైలట్ మాట్లాడుతూ.. ఆ సమయంలో “ఏమి జరుగుతుందో నా మెదడుకు తెలియకుండా పోయిందన్నారు.. శాంతించడానికి కొంత సమయం తీసుకున్న తర్వాత, విమానంలోని ప్రయాణీకులకు తెలియజేశాను.. దీంతో, ఒక క్షణం దిగ్భ్రాంతికరమైన నిశ్శబ్దం అలుముకుందన్నారు.. అయితే, పాము ఎక్కడ ఉంది.. దాని కదలికలను నేను చూస్తూనే ఉన్నాను. ఇది సీటు కింద సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు.. నాకు పాములంటే పెద్ద భయం లేదు.. కానీ, సాధారణంగా నేను వాటి దగ్గరికి వెళ్ళను అని తెలిపాడు.. కాగా, ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన వాటిలో కేప్ కోబ్రాస్ ఒకటి.. కేప్ కోబ్రాస్ వాటి విషం యొక్క శక్తి కారణంగా ఆఫ్రికాలో అత్యంత ప్రమాదకరమైన నాగుపాము జాతులలో ఒకటిగా చెబుతారు..