CM YS Jagan Kadapa Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీరిక లేకుండా గడుపుతున్నారు.. ఓవైపు ఢిల్లీ పర్యటన, మరోవైపు ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వరుస సమీక్షలు, పార్టీ మీటింగ్‌లు, బహిరంగసభలు.. బటన్ నొక్కి నిధులు విడుదల చేయడం ఇలా బిజీగా గడిపేస్తున్నారు.. ఇక, తన సొంత జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు సీఎం జగన్.. ఈ నెల 8, 9, 10 తేదీల్లో కడప జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మూడు రోజుల పాటు సొంత జిల్లాలో సాగనున్న సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పర్యటన వివరాల్లోకి వెళ్తే..
జులై 8వ తేదీన మధ్యాహ్నం 1.30 గంటలకు కళ్యాణదుర్గం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు సీఎం జగన్.. మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకొని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరానికి వెళతారు. అక్కడ సింహాద్రిపురం మండల నాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయలోని ఇంటికి చేరుకుని అక్కడే బస చేస్తారు.
ఇక 9వ తేదీన ఉదయం 8.50కి ఇడుపులపాయ నుంచి బయలుదేరి గండికోటకు వెళ్లనున్నారు సీఎం జగన్. ఉదయం 9.25కి గండికోటలోని ఒబెరాయ్ హోటల్ కు శంకుస్థాపన చేస్తారు.. ఉదయం 10.10కి గండికోట వ్యూపాయింటు చేరుకోనున్న ఆయన.. గండికోట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఉదయం 10.50కి భాకరాపురం హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 1.40 గంటల వరకు పులివెందులలో నూతన మున్సిపల్ భవనాన్ని, సిటీ ఫారెస్ట్, గరండాల వంక, వైఎస్సార్ ఇస్టా స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్, న్యూటెక్ బయోసైన్స్ లను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1.50 గంటలకు పులివెందులలోని ఆర్అండ్ బి అతిథి భవనానికి చేరుకోనున్న ఆయన.. మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలోని వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3.10 గంటలకు భాకరాపురంలోని హెలిప్యాడ్ కు చేరుకొని ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఇడుపులపాయలో మధ్యాహ్నం 3.35 నుంచి 4.05 గంటల వరకు ప్రజా ప్రతినిధులతో మాట్లాడనున్నారు. సాయంత్రం 4.10 గంటలకు ఇడుపులపాయలోని ఇంటికి చేరుకుంటారు.
10వ తేదీన ఉదయం 8.50 గంటలకు ఇడుపులపాయ నుంచి కడపలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. ఉదయం 9.25 గంటల నుంచి 10 గంటల వరకు ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. రోడ్డు మార్గాన కడపలోని రాజీవ్ మార్గ్ కు చేరుకుని రాజీవ్ పార్క్ తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా కడప సమీపంలోని కొప్పర్తికి చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు కొప్పర్తిలోని అల్టిక్సన్ యూనిట్ ను ప్రారంభించునన్నారు. ఉదయం 11.35 గంటల నుంచి 11.45 వరకు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం కడప విమానాశ్రయానికి చేరుకుని మధ్యాహ్నం 12.15కు బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లనున్న సీఎం వైఎస్ జగన్.. అక్కడి నుంచి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.