YSRCP Manifesto 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నామినేషన్ల స్వీకరణతో పాటు నామినేషన్ల పరిశీలన కూడా పూర్తి అయ్యింది.. ఇక, ఎన్నికల ప్రచారంలో ఆది నుంచి దూకుడు చూపిస్తోన్న అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికల మేనిఫెస్టోపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. గత ఎన్నికల్లో నవరత్నాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి.. ఘన విజయాన్ని అందుకున్న ఆ పార్టీ.. ఈ సారి కూటమిని ఎదురుక్కొనేందుకు సిద్ధం అవుతోంది.. అందులో భాగంగా.. నవరత్నాలను అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారాట.. మొత్తంగా ఈ రోజు వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్. నవరత్న హామీలను కొనసాగించనున్నారు. అంతేకాదు.. డీబీటీ పథకాలకు సంబంధించి నగదు పెంపు హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు కొత్తగా పారిశ్రామీకరణ, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టింది వైసీపీ.
Read Also: Rajasthan : చెరువులో కాలు జారి.. తండ్రికొడుకులతో సహా నలుగురు మృతి
మహిళలు, రైతులు, యువకులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేనిఫెస్టో రూపొందించినట్టు సమాచారం. ఈసారి పేదలతోపాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. దీంతోపాటు మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మ్యానిఫెస్టోలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో వుంటుందని వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్షాలు ఇస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా, వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏ ఉండబోతోంది.. అన్ని వర్గాలను ఆకట్టుకోవడానికి సీఎం వైఎస్ జగన్ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు..? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.