YS Jagan Nomination: మేమంతా సిద్ధం బస్సు యాత్రతో రాష్ట్రాన్ని చుట్టే.. బుధవారం రోజు బస్సు యాత్రను ముగించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్నారు. మొదట సిద్ధం సభలు, ఆ తర్వాత మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా రాష్ట్రం మొత్తాన్ని చుట్టేశారు జగన్. మూడో విడత ప్రచారానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఈ లోపు తన నియోజకవర్గం పులివెందులలో నేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు. ఇప్పటికే జగన్ తరపున పులివెందుల మున్సిపల్ వైస్ చైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ వేశారు. ఈరోజు మరో సెట్‌ని జగన్ స్వయంగా దాఖలు చేయనున్నారు.
Read Also: Gurudatta Stotram: గురువారం నాడు ఒక్కసారి వింటే చాలు దారిద్య్రాన్ని తొలగిపోతుంది..
ఇక, పులివెందుల పర్యటన కోసం ఈ రోజు ఉదయం 7 గంటల 45 నిమిషాలకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఇంటి నుంచి జగన్ బయల్దేరతారు. ఉదయం 8 గంటల 5 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టులో ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. కడప నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల వెళ్తారు. అక్కడ సీఎస్‌ఐ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగసభలో జగన్ పాల్గొంటారు. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు బహిరంగ సభ జరుగుతుంది. ఆ తర్వాత బైరోడ్ పులివెందుల మినీ సెక్రటేరియట్ కాంప్లెక్స్‌లోని రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్‌కు చేరుకుంటారు. 11 గంటల 25 నిమిషాల నుంచి 11 గంటల 40 నిమిషాల మధ్య నామినేషన్ కార్యక్రమం ఉంటుంది. మరోవైపు.. నామినేషన్ పూర్తయ్యాక పులివెందుల భాకరాపురంలోని తన ఇంటికి వెళ్తారు జగన్. అక్కడ కాసేపు రెస్ట్ తీసుకుని మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో హెలికాప్టర్ ద్వారా కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కడప ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న సీఎం.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.