CM YS Jagan: ప్రజలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్న దుర్మార్గుల విషయంలో ఎలాంటి మొహమాటం వద్దు.. చట్టాన్ని ప్రజలకు మంచి, రక్షణ కల్పించే పోలీసులపై దాడికి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ఆయన.. విధి నిర్వహణలో అమరులైన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించారు. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసాంఘిక శక్తులు అనే పదానికి రీ డిఫైన్ చేయాల్సిన పరిస్థితి.. ప్రశాంతంగా సాగుతున్న ప్రజా జీవితాన్ని తమ స్వార్థం కోసం దెబ్బ తీస్తున్న శక్తులన్నీ కూడా అసాంఘిక శక్తులే అన్నారు.
Read Also: Mission Gaganyan: మిషన్ గగన్‌యాన్ మొదటి ట్రయల్ సక్సెస్
ప్రభుత్వం, సమాజం మీద దాడి చేసి మనుగడ సాగించాలని అనుకునే శక్తులు అన్నీ కూడా అడవుల్లో, అజ్ఞాతంలో లేవు.. ప్రజా జీవితంలో ఉంటూ ప్రజా జీవితం మీద దాడి చేయటం ఈ మధ్య చూస్తున్నాం అన్నారు సీఎం వైఎస్ జగన్.. ప్రజా స్వామ్యం, పౌర హక్కులు, పత్రికా స్వేచ్ఛ లాంటి పదాల అర్థం అంటే.. ఒక ముఠా, ఒక వర్గం చట్టాన్ని, పోలీసులు, న్యాయస్థానం నుంచి లాక్కోవటం కాదు అన్నారు. అంగళ్లులో ప్రతి పక్ష నేత తమ పార్టీ వారిని రెచ్చ గొట్టి పోలీసులపై దాడి చేయించారు.. పుంగనూరులో 40 మంది పోలీసులు గాయాలు అయ్యేలా చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారు.. అవినీతి చేసి, నేరాలు చేసి ఆపై ఆధారాలు అన్నీ చూసిన తర్వాత న్యాయస్థానాలు అనుకూలంగా తీర్పు ఇవ్వక పోతే న్యాయ మూర్తుల మీద ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తమను ఎవరూ ఏమీ చేయలేరని ఇవన్నీ చేస్తున్నారు.. ఇవన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారు చేసే పని తప్ప వేరే కాదన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.