CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది.. పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది ఎస్‌ఐపీబీ.. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందాలని స్పష్టం చేశారు.. దీనిని కలెక్టర్లు సమగ్రంగా పర్యవేక్షించాలన్నారు.. ఇప్పటికే ఇది అమల్లో ఉంది. సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థవంతంగా అమలు అవుతుంది.. ఇది సరిగ్గా అమలవుతుందా? లేదా? అన్నదానిపై సమీక్ష చేసి క్రమం తప్పకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి కలెక్టర్లు నివేదికలు పంపాలన్నారు.. ప్రైవేట్ సహా అన్నిరకాల పరిశ్రమల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి.. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది, ఈ చట్టాన్ని తప్పకుండా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలు అనేది అత్యంత ముఖ్యమైనది అన్నారు సీఎం జగన్.. స్థానికులకు 75శాతం ఉద్యోగాలు ఇచ్చే క్రమంలోనే పరిశ్రమలకు అన్నిరకాలుగా తోడుగా నిలుస్తున్నాం.. భూములు ఇతర వనరులు సమకూరుస్తున్నాం.. స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఇది చేస్తున్నాం. ఒక పరిశ్రమ ఏర్పాటు, అది సమర్థవంతంగా నడవాలంటే ఆ ప్రాంతంలోని ప్రజల మద్దతు చాలా అవసరం అన్నారు.
స్థానిక ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యం. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే చట్టం తీసుకు వచ్చాం. ఇప్పటికే ఏర్పాటై ఉన్న, నిర్మాణంలో ఉన్న, రాబోతున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. సరిపడా మానవవనరులు రాష్ట్రంలో ఉన్నాయి, నైపుణ్యాభివృద్ధికి కొదవలేదని స్పష్టం చేశారు. కంపెనీలు ఏవైనా సరే.. రైతులనుంచి పంటల ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందే.. ఈమేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం జగన్. పరిశ్రమలకు శుద్ధిచేసిన, డీ శాలినేషన్ నీటినే వినియోగించుకునేలా చూడాలన్న ఆదేశాలు జారీ చేశారు .. జనాభా పెరుగుతున్న కొద్దీ తాగునీటికీ, వ్యవసాయానికీ మంచి నీటికొరత రాకుండా చూడాలంటే డీశాలినేషన్ లాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా లభ్యమయ్యే నీటిని పరిశ్రమలకు ఇవ్వడంపై తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన.. ఇజ్రాయిల్ తరహ విధానాలతో ముందుకు సాగాలన్నారు.
ఇక, ఎస్‌ఐపీబీ ఆమోదం పొందిన ప్రతిపాదనల విషయానికి వెళ్తే..
1. వైఎస్‌ఆర్ జిల్లా వేంపల్లె మండలం అశోక్ నగర్, మరియు బక్కన్నవారి పల్లె వద్ద 1500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.. ఈ ప్రాజెక్టును జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ ప ఎట్టనుంది.. డిసెంబర్ 2024లో పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోనున్నారు. 3314.93 మిలియన్ యూనిట్లు కరెంటు ఏడాదికి ఉత్పత్తి లక్ష్యంగా ఉంది.. దాదాపు 1500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
2. హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ అనుబంధ సంస్థ క్లీన్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు.. 225 మెగావాట్ల సోలార్, 150 మెగావాట్ల విండ్ పవర్ ఉత్పత్తి చేయగల సామర్థ్యం దీని సొంతం.. రూ.2450 కోట్ల పెట్టుబడితో అక్టోబరు 2023లో పనులు ప్రారంభం కానున్నాయి.. చివరి దశ 2025 అక్టోబరు నాటికి పూర్తిచేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. 375 మందికి ఉద్యోగావకాశాలు రానుండగా.. నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల మరియు వైఎస్‌ఆర్ జిల్లాలో ప్రాజెక్టులు నిర్మించనున్నారు.
3. విశాఖ జిల్లా అన్నవరంలో మే ఫెయిర్ హెటళ్లు మరియు రిసార్టులు నిర్మించనున్నారు.. రూ.525 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. దాదాపు 750 మందికి ప్రత్యక్షంగా, వేయి మందికి పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి.. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు.. ప్రాజెక్టులో భాగంగా కన్వెన్షన్ సెంటర్, 250 హోటల్ గదులు. మినీ గోల్ఫ్ కోర్టు తదితర సదుపాయాలు. షాపింగ్ మాల్ సహా విల్లాలు ఏర్పాటు చేయబోతున్నారు.
4. తిరుపతి పేరూరు వద్ద రూ. 218 కోట్లతో హయత్ ఇంటర్‌నేషనల్ హోటల్ నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపారు.. 260 మందికి ప్రత్యక్షంగా, 1296 మందికి పరోక్షంగా ఉద్యోగాలు రానుండగా. మూడున్నర సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం టార్గెట్‌గా పెట్టుకున్నారు.
5. విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద హిందుస్థాన్ కోకాకోలా బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ. 1200 కోట్ల పెట్టుబడితో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1800 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
6. తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్ పుడ్ మరియు బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. రూ.400 కోట్ల పెట్టుబడితో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి.. కాఫీని సాగుచేస్తున్న 2500 మందికి కూడా లబ్ధి చేకూరనుండగా.. ఏడాదికి 16వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా ఉంది.
7. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో గోకుల్ ఆగ్రో రిసోర్స్ లిమిటెడ్ కంపెనీతో ఎడిబుల్ ఆయిల్ తయారీ ఫ్యాక్టరీని రూ.230 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. రోజుకు 1400 టన్నులు ఉత్పత్తి లక్ష్యంగా ఉండగా.. ప్రత్యక్షంగా 350 మందికి, పరోక్షంగా 850 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. 2500 మంది రైతులకూ ఉపయోగంగా ఉండనుంది.
8. తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది.. ఏడాదికి 40 వేల టన్నుల తయారీ లక్ష్యంగా ఉండగా.. రూ.168 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.. 250 మందికి ప్రత్యక్షంగా, 800 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు రానున్నాయి.. 3 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.