NTV Telugu Site icon

CM YS Jagan: డ్రైవర్‌కు టికెట్ ఇస్తే తప్పేంటి?.. లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం ముఖాముఖి

Cm Ys Jagan

Cm Ys Jagan

CM YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం మధ్యాహ్నం తిరుపతి జిల్లా చిన్నసింగమలకు చేరుకుంది. చిన్నసింగమలలో లారీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడారు. టిప్పర్‌ డ్రైవర్‌ను చట్టసభలో కూర్చోబెట్టేందుకే టికెట్‌ ఇచ్చానని సీఎం తెలిపారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్‌, బీఈడీ చదివాడని.. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా బాధపడలేదన్నారు. ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడని.. జగన్‌ టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడన్నారు.

Read Also: Mudragada Padmanabham: జనసేనాని పవన్ కల్యాణ్‌పై ముద్రగడ ఫైర్

అయినా టిప్పర్‌ డ్రైవర్‌కు టికెట్‌ ఇస్తే తప్పేంటని అని టీడీపీ అధినేత చంద్రబాబును ప్రశ్నించారు. కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారన్నారు. జగన్ ఏం తప్పు చేశాడని టీడీపీ అవహేళన చేస్తోందని ప్రశ్నలు గుప్పించారు. ఆటో, ట్యాక్సీ, టిప్పర్‌ డ్రైవర్లకు తోడుగా ఉంటున్నామన్నారు. ఏడాది రూ.10వేల చొప్పున, ఐదేళ్లలో రూ.50 వేలు ఇచ్చామని.. వాహనమిత్ర ద్వారా ఇప్పటివరకు రూ.1296 కోట్లు ఇచ్చామన్నారు. అనంతరం డ్రైవర్ల సమస్యను ముఖ్యమంత్రి జగన్ విన్నారు.

మండుటెండలోనూ అపూర్వ స్వాగతం
అంతకు ముందు శ్రీకాళహస్తిలో సీఎం జగన్ బస్సుయాత్రకు అపూర్వ స్పందన లభించింది.మండుటెండలోనూ శ్రీకాళహస్తిలో రోడ్డుకిరువైపులా బస్సుయాత్రలో సీఎం జగన్‌కు మహిళలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా సీఎం జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజలతో మమేకం అవుతున్న సీఎం జగన్‌, సంక్షేమంపై ఆరా తీస్తున్నారు.