CM YS Jagan Delhi Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మరోసారి హస్తినబాట పట్టనున్నారు.. ఈ సారి రెండో రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులను, అధికారులతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.. రేపటి నుంచి రెండు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన సాగనుంది.. హస్తిన టూర్ కోసం రేపు (గురువారం) ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరనున్నారు సీఎం వైఎస్ జగన్.. పదిన్నరకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ చేరుకోనున్న ఆయన.. మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు. ఇక, సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్‌షాలతో సీఎం జగన్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది. రాత్రికి ఢిల్లీలోనే బస చేస్తారు ఏపీ సీఎం.
Read Also: Gam Gam Ganesha: చిన్న దేవరకొండ ‘బృందావనివే’ సాంగ్ రిలీజ్ చేసిన రష్మిక మందన్న
ఇక, ఎల్లుండి ఉదయం 10 గంటలకు విజ్ఞాన్ భవన్ కు చేరుకోనున్న సీఎం వైఎస్ జగన్.. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సమావేశం కొనసాగనుంది.. ఆ తర్వాత అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను.. వివిధ శాఖల అధికారులను కలిసే అవకాశం ఉంది.. దానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు కావాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీ పర్యటన అనంతరం సీఎం సొంత జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.. ఈ నెల 8, 9 తేదీల్లో సీఎం జగన్ కడప జిల్లా, పులివెందులో పర్యటించనున్నారని తెలుస్తోంది. అయితే, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత సీఎం జగన్ ఢిల్లీ వెళ్లడం ఇదే తొలిసారి.. దీంతో.. ప్రధాని, హోంశాఖ మంత్రులతో ఈ వ్యవహారంపై కూడా సీఎం జగన్ చర్చిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకమై.. చంద్రబాబును అరెస్ట్ చేశారనే విమర్శలు వినిపిస్తోన్న నేపథ్యంలో.. సీఎం వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారు? అనేది చూడాలి.