CM YS Jagan: 2008లో వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీ డేను ప్రకటించారు.. దేశంలోనే తొలి సారి మైనారిటీలకు రిజర్వేషన్లు కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. నాన్న ఒక అడుగు వేస్తే.. మీ బిడ్డ రెండు అడుగులు వేశాడు అని తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్.. దేశంలోనే అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను స్థాపించారు అబుల్ కలాం ఆజాద్ అని గుర్తుచేశారు.
గత ప్రభుత్వం మైనారిటీలకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేక పోయింది.. కానీ, రెండు సార్లు క్యాబినెట్ కూర్పు చేశాను.. రెండు సార్లు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చి నా పక్కన కూర్చోబెట్టుకున్నాను అని తెలిపారు సీఎం జగన్. నలుగురు మైనారిటీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం.. నలుగురు మైనారిటీలకు శాసనమండలి సభ్యత్వం ఇచ్చాం.. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఒక మైనారిటీ మహిళకు అవకాశం కల్పించామన్న ఆయన.. ఈ నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. అన్ని పదవుల్లో 50 శాతం అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లకు ఇచ్చే విధంగా ఏకంగా చట్టమే చేశాను అన్నారు. వేసే ప్రతి మొక్క రేపు చెట్టు కావాలి.. షాది తోఫా పథకంలో పదవ తరగతి నిబంధనను చాలా మంది తీసి వేయమని నన్ను అడిగారు.. ఎన్నికల సమయంలో ఈ నిబంధన వద్దు అన్నారు.. నాయకుడు ఎన్నికల గురించి కాదు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించించాలని సూచించారు.
ఈ నాలుగున్నర ఏళ్లల్లో మంచి చేశాను అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అన్నారు సీఎం జగన్.. ఉర్దూను రెండవ అధికార భాషగా చేశాం.. హజ్ యాత్రకు విజయవాడ నుంచి నేరుగా వెళ్లే అవకాశం రావాలి అని చర్యలు తీసుకున్నాం.. దీని కోసం 14 కోట్ల రూపాయల భారం పడినా వెనుక అడుగు వేయలేదన్నారు. హజ్ యాత్రకు వెళ్లినప్పుడు మన ప్రభుత్వం బాగుండాలని దువా చేయమని మాత్రం అడిగాను అని గుర్తుచేసుకున్నారు సీఎం వైఎస్ జగన్.. ఇక, ఈ సందర్భంగా.. డా. సత్తార్ కు మౌలానా ఆజాద్ నేషనల్ అవార్డు -2023 ను ప్రదానం చేసిన సీఎం జగన్.. అబ్దుల్ హక్ అవార్డు -2023 ను డా. ఫక్రుద్దీన్ హక్ కు అందజేశారు.