CM YS Jagan: మనం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అని ప్రకటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. గుడివాడలో టిడ్కో ఇళ్ల పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. ఈరోజు దేవుడి దయతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. మనం కడుతున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు అన్నారు. పేదలకు 300 అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితంగా లబ్ధిదారులకు ఒక్క రూపాయితో ఇస్తామని చెప్పాం.. లేవుట్ 257 ఎకరాల స్థలం సేకరించి ఒక పక్కన టిడ్కో ఇళ్లు, మరోపక్క ఇళ్ల స్థలాలు ఇచ్చి నిర్మాణం చేస్తున్నాం. వీటన్నింటి మధ్య ఈరోజు కొత్త గుడివాడ నగరం కనిపిస్తోందన్నారు.. 16,240 కుటుంబాలు.. ఇంటికి కనీసం ముగ్గురు వేసుకున్నా 40 వేల పైచిలుకు జనాభా ఇక్కడే కాలనీలో నివాసం ఉండబోతోంది. 800 కోట్ల రూపాయలతో 8,912 ఇళ్లు ఈరోజు కట్టడమే కాకుండా కట్టిన ఇళ్లను నా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు. 7,728 ఇళ్ల స్థలాలను, ఇళ్లులేని నా నిరుపేద అక్కచెల్లెమ్మలకు ఇళ్లస్థలాలు కూడా ఇచ్చాం. 8,912 టిడ్కో ఇళ్లతో కలిపి 16,240 ఇళ్లు, కుటుంబాలు నివాసం ఉండబోతున్నాయి. గుడివాడలో మొత్తంగా 13,145 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలిచ్చాం. ఒక్క నియోజకవర్గంలోనే 22 వేల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ప్రతి లబ్ధిదారుకి 1.1 సెంటు ఇచ్చాం. 7 లక్షల రూపాయలు అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది. జూలై 8న 8,859 ఇళ్ల పట్టాలకు అదనంగా మరో 4,200 ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నాం అని వెల్లడించారు సీఎం జగన్.
ప్రతి పేద కుటుంబం కూడా బాగుపడాలనే బాధ్యతతో అడుగులు వేస్తున్నాం అని తెలిపారు సీఎం జగన్. ఇదే గుడివాడకు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన అల్లుడు ఉన్నాడు. తన 14 ఏళ్ల పాలనలో ఇక్కడి పేదలకు కనీసం ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలిచ్చిన దాఖలాలు లేవు. ఒక్క పేదవాడికి కూడా ఒక సెంటు ఇచ్చిన దాఖలాలు లేవు. బాబు పాలనకు భిన్నంగా పేదల ప్రభుత్వంగా ఈ ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి చిత్తశుద్ధితో అడుగులు వేస్తున్నాం అని తెలిపారు. అక్కచెల్లెమ్మల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 30,60,000 ఇళ్లపట్టాలివ్వడం జరిగింది. ఇప్పటికే 21 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. మనం నిర్మిస్తున్న కాలనీలు 17,000.. ఇప్పటికే పూర్తయిన ఇళ్లు 5,52,000గా అని పేర్కొన్నారు. అక్కచెల్లెమ్మల పేరుతో ఇచ్చిన ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.2.5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఉంటుంది. మనం ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ 30,60,000 ఇళ్ల పట్టాల మీద 75,000 కోట్ల రూపాయల ఆస్తులు అక్కచెల్లెమ్మలకు అందజేస్తున్నాం. ఒక్కో ఇంటిని 2.70 లక్షలతో ఇంటిని కడుతున్నాం. డ్రెయిన్లు, రోడ్లు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్కు లక్ష ఖర్చు.. స్థలం విలువ 6 లక్షల నుంచి 10 లక్షలు, 15 లక్షల దాకా కూడా పోతుందని చెప్పడానికి గర్వ పడుతున్నా. ఇళ్ల మహాయజ్ఞం ద్వారా 2 – 3 లక్షల కోట్ల ఆస్తిని ప్రతి అక్కచెల్లెమ్మల చేతిలో పెడుతున్నాం అని పేర్కొన్నారు సీఎం జగన్.
దేవుడు నాకిచ్చిన అవకాశానికి ఇంతకన్నా సంతోషం ఉంటుందా అంటూ ఆనందం వ్యక్తం చేశారు సీఎం జగన్.. కొంత మందికి ఈర్ష్య ద్వేషం ఎక్కువయ్యాయి. నిరుపేదలకు నివాసం ఉండే 300 చ.అ. ప్లాట్ కట్టడానికి అయ్యే ఖర్చు అడుగుకు 2వేలు.. ఒక్కో ప్లాట్ కు దాదాపు 5.75 లక్షలు కట్టడానికి, మౌలిక సదుపాయాలకు మరో లక్ష.. 300 అడుగులు 6.75 లక్షలు ఖర్చయ్యే ప్లాట్ కు కేంద్రం 1.50 లక్షలు ఇస్తే రాష్ట్రం 1.5 లక్ష ఇస్తోందని.. మిగిలిన 3 లక్షల రూపాయలు చంద్రబాబు హయాంలో పేద వాడి పేరు మీద అప్పుగా రాశారని మండిపడ్డారు. ప్రతి నెలా 3 వేలు 20 ఏళ్లపాటు పేదవాడు కడుతూ పోవాలి. పేదవాడు 300 అడుగుల ఇంటిని సొంతం చేసుకొనేందుకు 7.20 లక్షలు జేబు నుంచి కట్టాలి.. అది చంద్రబాబు హయాంలో తెచ్చిన టిడ్కో పథకం అంటూ మండిపడ్డారు. నేల మీద ఇళ్లు లేవు, పట్టాలేదు, ఉచితంగా ఇచ్చింది అంతకన్నా లేదు. కానీ, మీ బిడ్డ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 300 చ.అ.లో నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లు 1,43,600.. అన్ని హక్కులతో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. వీటి విలువ 6.75 లక్షలు.. వీటిని ఒక్క రూపాయికే ఇస్తున్నాం అని వెల్లడించారు సీఎం జగన్.