CM Revanth Reddy: సచివాలయంలో ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, సునీల్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ధరణిలో సమస్యలు, మార్పులు-చేర్పులు ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు.ధరణి సమస్యల పరిష్కారానికి మరింత లోతుగా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలన్నారు.సవరణలపై కొత్త సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సవరణలపై ప్రజాభిప్రాయం పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనల ఆధారంగా సమగ్ర చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చ పెడదామన్నారు.
ధరణి కమిటీ అధ్యయనం తర్వాత పూర్తి స్థాయి భూసమస్యల పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వం కుట్రపూరితంగా తెచ్చిన ధరణి వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ధరణిలో 35 లావాదేవీల మాడ్యూళ్లు, 10 సమాచార మాడ్యూళ్లతో క్షేత్రస్థాయిలో సమస్యలకు కొంత పరిష్కారం చూపించామని వివరించారు. సాక్షాత్తు హైకోర్టు ధరణిలోని ఎన్నో లోపాలను ఎత్తిచూపిందని భట్టి విమర్శించారు. ధరణి కమిటి తుది నివేదిక ఆధారంగా సమస్యలను పరిష్కారిస్తామని ఆయన హామీ ఇచ్చారు.