NTV Telugu Site icon

CM Revanth Reddy : ప్రజాపాలనను ప్రతిబింబించేలా 9 రోజుల వేడుకలు

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు జరిగే వేడుకల ఏర్పాట్లలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే ఈ వేడుకల్లో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శాఖలవారీగా ఒకటో తేదీ నుంచి వరుసగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కొత్త ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమిపూజ నిర్వహిస్తారు. ఇప్పటికే 28 నియోజకవర్గాల్లో ఈ భవనాల పనులు మొదలయ్యాయి. మరో 26 నియోజకవర్గాల పరిధిలో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది. ప్రజా పాలన విజయోత్సవాల్లో వీటికి శంకుస్థాపన చేస్తారు. ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా స్పోర్ట్స్అథారిటీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పోటీలను నిర్వహిస్తుంది.

వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారా మెడికల్ కాలేజీలను నెలకొల్పుతారు. వీటితో పాటు కొత్తగా 213 అంబులెన్స్ వాహనాలు అందుబాటులోకి తీసుకు వస్తారు. మరోవైపు ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు అందించేందుకు జిల్లాకో ట్రాన్స్జెండర్ క్లినిక్ను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ సేవలను నియంత్రించేందుకు ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకుంటామని, ఆసక్తి ఉన్న వారికి శిక్షణను ఇచ్చి ట్రాఫిక్ వలంటీర్లుగా నియమిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. విజయోత్సవాల్లో భాగంగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ వలంటీర్లుగా నియమిస్తారు. హైదరాబాద్ నగరంలో వివిధ అభివృద్ది కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను విజయోత్సవాల్లో చేపడుతారు. గోషామహల్లో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమిపూజ చేస్తారు.

Duddilla Sridhar Babu : అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్‌పై ఏడుస్తున్నారు

ఆరంఘర్ జూపార్క్ ఫ్లై ఓవర్ను ప్రారంభిస్తారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన ఆరు ఎస్టీపీలను ప్రారంభిస్తారు. హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే వివిధ పనులకు భూమిపూజ చేస్తారు. వీటితో పాటు కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్లతో ఆరు జంక్షన్లను అభివృద్ధి చేసే రూ.826 కోట్ల భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతారు. హైదరాబాద్లో శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరా శక్తి మహిళా బజార్ను ప్రారంభిస్తారు. తెలంగాణ ఫారెస్ట్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ భవనానికి పునాది రాయి వేస్తారు. వీటితో పాటు అటవీ పర్యాటక శాఖల అధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు.

ఘట్కేసర్లో బాలికలకు ప్రభుత్వ ఐటీఐ, అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి, మేడ్చల్, నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. దామరచర్లలో యాదాద్రిలో థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల ఒక యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. దీంటో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 237 సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతులను ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన స్పోర్ట్ యూనివర్సిటీకి భూమిపూజ చేస్తారు. ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ అధ్వర్యంలో ఏఐ సిటీ ఏర్పాట్లతో పాటు పలు ఒప్పందాలు చేసుకుంటారు.

విజయోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల్లో వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు. అన్ని స్థాయిల్లోని విద్యార్థులు ఈ వేడుకలు జరుపుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. శాఖల వారీగా నిర్ణీత ప్రణాళిక ప్రకారం సంబంధిత మంత్రుల సారధ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మంత్రులతో పాటు ఈ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.

Koti Deepotsavam 2024 Day 16 LIVE: చిదంబరం శ్రీ నటరాజస్వామి శివగామసుందరి కల్యాణం..