CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి ముహూర్తం ఖరారయ్యింది. బుధవారం ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి, ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కార్యదర్శి శేషాద్రి, రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జితేందర్‌తో కలిసి ప్రధానిని కలవనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కీలక అంశాలపై చర్చించనున్నారు.
హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, మెట్రో రైలు పొడిగింపు ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపు వంటి కీలక అంశాలపై ప్రధానిని సీఎం మెమొరాండం ద్వారా విజ్ఞప్తి చేయనున్నారు. నగరాభివృద్ధిలో భాగంగా కేంద్రం నుంచి మరిన్ని సహాయ నిధులను కోరే దిశగా ఈ భేటీ కొనసాగనున్నట్లు సమాచారం.
Mahashivratri 2025: శివ లింగాలు ఎన్ని రకాలు.. వాటి విశిష్టత ఏంటి?
ఇక ప్రధాని మోడీతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర కేబినెట్‌లోని పలువురు కీలక మంత్రులను కూడా కలవనున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులకు మద్దతుగా కేంద్ర మంత్రుల వద్ద ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఈ రాత్రికే సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి ఢిల్లీకి బయలుదేరనున్నారు. ప్రధానితో సమావేశం అనంతరం కాంగ్రెస్ అధిష్టానం నేతలను కూడా రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, తెలంగాణలో కేబినెట్ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశముంది. కొత్తగా మంత్రివర్గంలో చేరబోయే నేతల ఎంపిక, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై పార్టీ పెద్దలతో ముఖ్యంగా చర్చించనున్నట్లు సమాచారం.
తెలంగాణలోని తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వ పాలన, కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్న ఈ పర్యటనపై అన్ని వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి అందబోయే సహాయ నిధులపై ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎంకు ప్రధాని మోడీ నుంచి ఎలాంటి హామీలు లభిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.
Vallabhaneni Vamshi: వంశీ కస్టడీ వ్యవహారంలో కీలక పరిణామం..