CM Revanth Reddy: నేడు హైదరాబాద్ లో ప్రముఖ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యంగా ఉద్యోగ సంఘాల నేతల హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు. ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించిన ఆందోళనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం, ఈ సమరాలు ప్రజల మీదే అవుతాయని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మూడున్నర లక్షల మంది, మీరు చేపట్టిన సమరం 97 శాతం ప్రజల మీదేనా? అంటూ ప్రశ్నించారు.
ఉద్యోగులకు జీతాలు లేకపోతే ప్రభుత్వం ముందుగానే చొరవ తీసుకుని చెల్లింపులు ప్రారంభించిందని అన్నారు. పదవీకాలాన్ని 61 ఏళ్లకు పెంచాం, కానీ అందుకు అనువైన లాభాలు ఇవ్వకుండా ఉండేందుకు కాకుండా, ఉద్యోగుల ప్రయోజనాల కోణంలోనే ఆ నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు. ఉద్యోగులకు బకాయిలుగా ఉన్న 9 వేల కోట్ల రూపాయలను గత ప్రభుత్వాల వల్ల పెండింగ్ అయ్యాయని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు.. ‘సమరం’ అంటూ పోరాటానికి దిగుతారంటే ఆ పోరాటం ఎవరి మీద? అంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు. విషయం ఏమైనా ఉంటే చర్చకు రండి, ప్రజల మీద యుద్ధం చేయవద్దు అంటూ సీఎం విజ్ఞప్తి చేశారు.
Read Also: TVS Sport ES Plus: టీవీఎస్ మోటార్ నుండి మరో కొత్త బడ్జెట్ బైక్.. మరి ఇంత తక్కువ ధరకే లభ్యమా?
అలాగే, తాను సీఎంగా స్పెషల్ హెలికాప్టర్‌లో వెళ్లొచ్చు, విదేశాలకు స్పెషల్ ఫ్లైట్‌లో వెళ్లొచ్చు… కానీ, దుబారాను తగ్గించాలనుకుంటున్నా.. అందుకే సాధారణ ప్రయాణికుల్లా నడుస్తున్నా అన్నారు. ప్రభుత్వ ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న విషయాన్ని ఆయన తెలిపారు. ఇంకా సీఎం మాట్లాడుతూ.. మీకు ప్రజలు జీతాలు ఇస్తున్నారు. ప్రజలే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మా బట్టీలు మార్చుకుంటూ బడ్జెట్ సర్దుకుంటున్నాం. మీరు చెప్పండి… ఏ పథకం ఆపాలో? ప్రజలకు చెప్తారా ‘ఇది ఆపండి, మాకు ఇవ్వండి అని?” అంటూ సూటిగా ఉద్యోగ సంఘాల నేతలను ప్రశ్నించారు.
సమరం చేయడం వల్ల రాష్ట్రం దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు. బ్యాంకర్లు బిచ్చగాళ్ల లెక్క చూస్తున్నారు, అయినా అప్పు తీయట్లేదు. గౌరవంగా వ్యవహరిద్దాం. ఒక కుటుంబం చిన్నాభిన్నమైతే ఎలా ఉంటుందో రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అని సీఎం అన్నారు. అలాగే మీకు అనుమానాలుంటే రండి, వివరాలన్నీ చెబుతా.. సమయం కలిసివస్తే కొత్త కోరికలు నెరవేర్చే ఉద్దేశం ఉంది. కానీ, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు. సమరం కాదు, సమయ స్పూర్తి అవసరం అంటూ మాట్లాడారు.