Rajiv Gandhi Jayanti: భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనను స్మరించుకుంటున్నారు ప్రజలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయం ముందు ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి. దేశ సమగ్రతను కాపాడే క్రమంలో ఆయన ప్రాణాలు అర్పించారు. భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తీర్చిదిద్దిన మహానేత రాజీవ్ గాంధీ” అని పేర్కొన్నారు.
అలాగే దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ, దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారన్నారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారు. 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని, కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ అంటూ పేర్కొన్నారు. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడిందని ఆయన అన్నారు.
రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు తీసుకెళతాం. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపామన్నారు. రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసన సభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తాం. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోమన్నారు.
Rekha Gupta Attacked: రేఖా గుప్తాపై దాడి చేసిన వ్యక్తి ఫొటో విడుదల.. ఏ రాష్ట్ర వ్యక్తి అంటే..!
ఇక ఢిల్లీలోని వీర్ భూమిలో రాజీవ్ గాంధీ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, “రాజీవ్ గాంధీ తక్కువ కాలం ప్రధానమంత్రి పదవిలో ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థలో, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. భారతదేశం ఆధునిక దిశగా సాగడానికి పునాదులు వేశారు” అని గుర్తుచేశారు. సద్భావన దివస్ సందర్భంగా పలువురు నేతలు రాజీవ్ గాంధీ సేవలను స్మరించి ఆయనకు నివాళులర్పించారు.