సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందని, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదన్నారు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాం అని, ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. తమ రెండేళ్ల పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. ఖమ్మంలో రూ.362 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.
Also Read: T20 World Cup: భారత్‌లో ఆడటంపై బంగ్లాదేశ్ కీలక ప్రతిపాదన.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐర్లాండ్..
‘సింగరేణిలో కుంభకోణం జరిగింది, బొగ్గు మాయమైందని కొన్ని పత్రికల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అవకతవకలకు తావులేదు. సింగరేణి టెండర్లను అనుభవం ఉన్నవారికే ఇస్తాము. ఈ విషయంలో అణా పైసా కూడా అవినీతికి ఆస్కారం లేదు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వలేదు. తప్పుడు ప్రచారాలతో అపోహలు సృష్టించి మారీచుడు, సుబాహుడు బలపడేందుకు సహకరిస్తున్నారు. మీకు మీకు మీడియా పంచాయితీలు ఉంటే తలుపులు వేసుకొని కొట్టుకోండి. అంతేకానీ అందులోకి మమ్మల్ని లాగొద్దు. మంత్రులను బద్నాం చేయొద్దు. మా మంత్రులపై వార్తలు రాసేముందు నా దగ్గర వివరణ తీసుకోండి. మీడియాకు వివరాలు ఇచ్చేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటా. మా మంత్రులపై వార్తలు వస్తే నా గౌరవానికి భంగం కలుగుతుంది. నా నాయకత్వం పట్ల అపోహలు సృష్టిస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
