CM Revanth Reddy: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు సోమవారం నుంచి జరుగుతున్నాయని.. ఈ పరీక్షల కోసం ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కాలయాపనకు ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నామన్నారు. గ్రూప్ 1 పరీక్షలు కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కొంతమంది ఉద్యోగాలు పోవడంతో వాళ్లు ఆందోళన చేస్తున్నారని సీఎం వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చామన్నారు. 53 పోస్టులకు మెయిన్స్ ఎగ్జామ్స్‌కు 31 వేల మందిని మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేశామన్నారు. ప్రిలిమ్స్ పరీక్ష అయ్యాక విపక్షాలు ఆందోళన చేస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చాక మధ్యంతరంగా మారిస్తే కోర్టులు ఊరుకుంటాయా.. అలా మారిస్తే కోర్టులు రద్దు చేస్తాయన్నారు. పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ఆందోళన చేస్తున్న 4 శాతం అభ్యర్థులు ఇప్పటికైనా హాల్ టికెట్స్ తీసుకోవాలన్నారు. గ్రూప్ 1 పరీక్షలు రాయాలని ముఖ్యమంత్రి సూచించారు. అభ్యర్థుల కోర్టుకు వెళ్లారని అప్పీల్‌ను కోర్టు కొట్టేసిందన్నారు. న్యాయస్థానాలు ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్ష విధానాన్ని సమర్థించాయన్నారు. ప్రతిపక్షాలు మిమ్మల్ని వాడుకుంటున్నాయని.. వారి ఉచ్చులో పడొద్దన్నారు. దయచేసి పరీక్షలు రాయాలని అభ్యర్థులకు సూచించారు. పోలీసులు అభ్యర్థులపై లాఠీ ఛార్జి చేయొద్దని, కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టొద్దన్నారు. అభ్యర్థుల పట్ల పోలీస్ సిబ్బంది ఉదారంగా వ్యవహరించాలని, కేసులు పెట్టకుండా ఉన్నతాధికారులకు ఆదేశిస్తున్నామన్నారు. రిజర్వేషన్ పకడ్బందీగా అమలు చేయాలనేదే మా లక్ష్యమన్నారు.
Read Also: KTR : గ్రూప్ వన్ అభ్యర్థులను పశువుల్లా చూస్తుంది ప్రభుత్వం
పోలీస్ డ్యూటీ కార్యక్రమం గురించి మాట్లాడుతూ.. 2013 నుంచి 2014 వరకు దాదాపు 11 ఏళ్లు పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించక పోవడం వల్ల నైపుణ్యం వెలికి తీయలేక పోయామని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వం అంచనాకు తగ్గకుండా రాష్ట్ర పోలీసులకు స్ఫూర్తినిచ్చే విధంగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారని కొనియాడారు. రాష్ట్ర సాధనలో పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగం మరువలేనిదన్నారు. పోలీస్ ఉద్యోగం అంటే సాధారణమైనది కాదు,ప్రభుత్వం,ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవం పోలీసులపై ఉంటుందని.. ఏ ఒక్కరు చిన్న తప్పు చేసినా…రాష్ట్ర ప్రభుత్వ గౌరవం పోతుందన్నారు. పోలీస్ అధికారులు తమ ఉద్యోగాలను పారదర్శకంగా నిర్వహించినప్పుడే సామాన్యునికి న్యాయం జరుగుతుందన్నారు.
డిపార్ట్‌మెంట్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.
రాబోయే 21వ తేదీన గ్రేహౌండ్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభిస్తామన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి స్కూల్‌లో అడ్మిషన్లు తీసుకోవచ్చు యంగ్ ఇండియా స్కూల్‌లో చదివించుకోవచ్చన్నారు. డీజీపీ స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు తమ పిల్లలను చదివించుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు నార్కోటిక్స్ బ్యూరో ఏర్పాటు చేశామన్నారు. మాదక ద్రవ్యాలు,సైబర్ క్రైమ్‌ను అరికట్టాలన్నారు. సైబర్ క్రైమ్ ను నియంత్రించడంలో దేశంలోనే ఉత్తమ అవార్డ్ వచ్చిందని సీఎం వెల్లడించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌ను నియంత్రణ చేసేందుకు ప్రకటనలు ఇచ్చే సినిమాలకే టికెట్ ధర పెంపు,ఇతర రాయితీలు ఇస్తున్నామన్నారు. డ్రగ్స్, గంజాయి కేసుల్లో ఎవరున్నా సహించవద్దని సీఎం ఆదేశించారు.