త్యాగానికి మారుపేరు కొండా లక్ష్మణ్ బాపూజీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించిన అఖిల భారత పద్మశాలి మహాసభలో ఆయన ప్రసంగించారు. “తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసి… తెలంగాణ వచ్చాకే పదవులు తీసుకుంటా అని చెప్పిన నేత కొండా లక్ష్మణ్ బాపూజీ. బీఆర్ఎస్ కి పురుడు పోసింది కొండా బాపూజీ. పార్టీ పెట్టినప్పుడు నీడ కల్పించింది ఆయనే.. కానీ ఆయనకు నిలువ నీడా లేకుండా చేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కనీసం సంతాపం చెప్పడానికి కూడా రాలేదు. పద్మశాలి బిడ్డలు గుర్తుంచుకోండి. టైగర్ నరేంద్రని ధృతరాష్ట్ర కౌగిలి చేసుకుని ఖతం చేశారు. బతుకమ్మ చీరల బకాయిలు పెట్టీ వాళ్ళను ఇబ్బంది పెట్టింది బీఆర్‌ఎస్. రాపోలు ఆనంద భాస్కర్.. 35 ఏండ్లు సేవలు చేసినందుకు.. రాజ్యసభకు పంపింది సోనియా గాంధీ. అవకాశం వస్తే పద్మశాలి సోదరులను కాపాడాలని ఆలోచన నాది. చేనేతకు అండగా ఉండాలన్నది నా ఆలోచన. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు.. ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీ కి పెడతాం. రైతన్నలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చామో… నేతన్నలకీ అంతే ప్రాధాన్యత మీ సోదరుడు రేవంత్… సీఎంగా ఉన్నాడు. అడిగి పని చేయించుకోండి..” అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
మీరు అండగా ఉండండి.. మీకు అండగా నేనుంటా అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. “బతుకమ్మ చీరలు.. పిట్టలు బెదిరించడం కోసం పోలాలల కట్టిర్రు తప్పితే ఆడబిడ్డలు కట్టుకున్నారా..? 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు రెండు చీరలు.. చీర సారెలు పెడతా. 27 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేసి.. అండగా నిలబడ్డది కాంగ్రెస్. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం… కుల గణన చేశాం. 56.33 శాతం బీసీ లు అని తేల్చాము. కొందరు తప్పుల తడక అని అంటున్నారు. అరవై రోజులు.. లక్ష మూడు వేల మంది ఉద్యోగులు పని చేశారు. పక్కా లెక్క తీసినం.. ఇది ఇష్టం లేని వాళ్ళు తప్పు అంటున్నారు. బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు లెక్క తప్పు అనడం కాదు.. ఎక్కడ తప్పు ఉందో చెప్పు అంటే తోక ముడిచారు. బలహీన వర్గాలకు రిజర్వేషన్ ఇస్తే అధికారం అడుగుతారు అని బీఆర్ఎస్, బీజేపీ అడ్డుపడుతున్నాయి. లెక్కలు తప్పు అనే వాళ్ళ కుట్రను గమనించాలి. బలహీన వర్గాల హక్కులు కలరాయాలని.. మీ గొంతు నులమాలని చూస్తున్నారు మీ లెక్క తప్పు చేస్తే నాకేం వస్తుంది. కేసీఆర్ కంటే మా లెక్క 6 శాతం ఎక్కువ మంది బీసీలు అని తెల్చాం. లెక్క తప్పు అంటే… రిజర్వేషన్ రాదు. కుట్రను బీసీలు గమనించాలి. బలహీన వర్గాలకు 42 శాతం రిజ్వేషన్లను ఇస్తాం.” అని సీఎం సభలో స్పష్టం చేశారు.