సీఎం కేసీఆర్ నేడు పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్, గౌరెడ్డిపేట శివారులో పెద్దపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో నిర్మించిన పెద్దపల్లి జిల్లా టీఆర్‌ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అయితే.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ పెద్దపల్లికి చేరుకుంటారు. అనంతరం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సారెస్పీ క్యాంపులో ఆ తరువాత కలెక్టరేట్ సమీపంలోని పెద్దకల్వలలో 50 ఎకరాల విస్తీర్ణంలోని మైదానంలో నిర్వహించనున్న బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
అయితే.. సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభకు సుమారు లక్షమంది రానున్న క్రమంలో అందుకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సభకు వస్తున్న వారి కోసం 132 ఎకరాల్లో పార్కింగ్‌కు స్థలాన్ని కేటాయించారు అధికారులు.