బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం – బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కీలక ఉపన్యాసం చేశారు బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఎగుర వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నది. అందరికీ శుభాకాంక్షలు. ఆనాడు పిడికెడు మందిమి వేలై, లక్షలై ఉప్పెనలా ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నం. ఊహించని రీతిలో దేశానికే మార్గదర్శనం చేస్తున్నం. అద్భుతమైన ప్రగతితో ముందుకు పోతున్నం. ఇవాళ మన టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల సంఖ్య 60 లక్షలు. ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా, మంత్రులుగా, చైర్మన్లుగా, సర్పంచులుగా లక్షలాదిమంది నాయకత్వం తయారైంది. కరోనా క్లిష్ట సమయంలో దేశమంతా ఆర్థికంగా వెనుకకు పోయినా, తెలంగాణ రాష్ట్రం మాత్రం ఆర్థిక క్రమశిక్షణ, నియంత్రణతో నిలదొక్కుకుంది.
ఒకనాడు కరువు కాటకాలతో కునారిల్లిపోయి, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే అని పాడుకున్న మనం నేడు పాలమూరు తల్లి సాగునీటితో, అద్భుతమైన పంటలతో పచ్చని పైట కప్పుకున్నది అని పాడుకుంటున్నం.ఎక్కడివాళ్లం అక్కడ పనిచేసుకుంటూ ముందుకు సాగితేనే ఇంత అభివృద్ధి సాధ్యమైంది. ఇంత వెనుకబడిన ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రాంతాన్నే ఇంత గొప్పగా మనం అభివృద్ధి చేసుకున్నపుడు రత్నగర్భ అయిన భారతదేశాన్ని ఇంకెంత గొప్పగా అభివృద్ధి చేసుకోగలం. అద్భుతమైన జల వనరులు, సాగు భూమి, సమ శీతోష్ణ వాతావరణం ఈ ప్రపంచంలో మరే దేశానికీ లేదు. మనకున్న వసతులకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫుడ్ చైన్ దేశంగా ఇండియా మారాల్సి ఉందన్నారు. మానవ వనరులను వాడుకోలేక పోతున్నం. అద్భుతమైన యువ సంపత్తి నిర్వీర్యమై పోతున్నది. యువతను మతోన్మాదులుగా మార్చే కుట్రలు జరుగుతున్నయి. దీన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఇది బీఆర్ఎస్ నుంచే ప్రారంభం కావాలె. ఇందులో భాగంగా దేశంలో భావజాల వ్యాప్తిని, దేశ ప్రజలను చైతన్యం చేయాల్సి ఉంది.
Read Also: Raviteja: ఫ్యాన్స్ గెట్ రెడీ.. వాల్తేరు వీరయ్య తమ్ముడు ఎంట్రీ షురూ
ఉత్తమమైన, గుణాత్మకమైన మార్పు కోసం ఉన్నతస్థాయికి చేరుకునే ఆర్ధిక ప్రగతి కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తది. ఇన్నాళ్లూ మనం కొససాగిస్తూ వచ్చిన అదే అంకితభావంతో ముందుకు పోదాం. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలకు వ్యతిరేకంగా, నూతన విధానాలను అమల్లోకి తెద్దాం. 40 కోట్ల ఎకరాల సాగు భూమి ఉండి, 70 వేల టీఎంసీల నీటి వనరులుండి, రైతుల ధర్నాలు ఇంకెంత కాలం?ఆకలి ఇండెక్సులో మనం ఎందుకు ముందు వరుసలో ఉన్నాం? ఎన్నో ఉద్యమాలు వచ్చినా ఈ దేశంలో పరిస్థితి ఎందుకు మారడం లేదు?రాజకీయాలంటే ఒక పార్టీ ఎన్నికల్లో గెలవడం, ఓడిపోవడం కాదు.ఎన్నికల్లో ప్రజలు గెలవాలె. ప్రజా ప్రతినిధులు గెలవాలె. సరిగ్గా ఇదే పరివర్తన కోసం ఏర్పాటైందే బీఆర్ఎస్ పార్టీ. ఎన్నో మర్శలను అధిగమించి ఇంతదూరం వచ్చినం. ఎవరో ఒకరు చైతన్య దీపం వెలిగించకపోతే ఈ దేశంలో కారు చీకట్లు కొనసాగుతునే ఉంటయి. ఈ చీకట్లో వెలిగించిన చిరుదీపమే బీఆర్ఎస్ పార్టీ.
నూతన జాతీయ విధానాల అవసరం. ఇన్నాళ్ళు పాలించిన కేంద్ర పాలకుల వైఫల్యాలను సరిదిద్దుతూ, ఈ దేశ సమగ్రాభివృద్ధికి, అనేక రంగాల్లో గుణాత్మక అభివృద్ధి సాధించడం కోసం జాతీయ విధానాలు రూపొందించాల్సిన అవసరముందని సీఎం అన్నారు. వ్యవసాయాధారిత భారతదేశంలో వ్యవసాయరంగం రోజురోజుకీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దేశానికి నూతన వ్యవసాయ విధానం (New Agriculture Policy) అవసరముంది. అదనపు నీటి వనరులున్నా నీటి కోసం యుద్ధాలు జరగడం శోచనీయం. చెన్నై లాంటి మహానగరానికి బకెట్ నీళ్ళు దొరకని దుస్థితి ఏమిటి? ఇదే సమస్య పై బాలచందర్ లాంటి దర్శకుడు తన్నీర్ తన్నీర్ అనే సినిమా తీస్తే ఆ నీటి బాధకు ప్రజలు దాన్ని సూపర్ హిట్ చేసే పరిస్థితులున్నాయి. ఇటువంటి అసంబద్ధ విధానాలను సరిచేయాల్సి ఉన్నది. కావేరీ నదీ జలాల కోసం తమిళనాడు, కర్నాటక వంటి సహచర రాష్ట్రాలు చేస్తున్న యుద్ధాలను చక్కదిద్దాల్సి ఉన్నది. దిక్కుమాలిన ట్రిబ్యునల్స్ పేరుతో నీటి యుద్ధాలను కొనసాగిస్తూ ఉన్న పరిస్థితి బాగు చేయాల్సి ఉన్నది. ఇందుకోసం ఈ దేశానికి నూతన జలవనరుల పాలసీ (New Water Policy) కావాలి.
ఈ దేశంలో లక్షలాది మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునే ప్రకృతి వనరులున్నయి. అయినా పల్లె పల్లెకూ విద్యుత్ అందించుకోలేక పోవడాన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉన్నది. అందుకు నూతన విద్యుత్ పాలసీ (New Power Policy) కావాలి.ఆర్థికంగా ఉజ్వలమైన స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నా ఫారిన్ ఎక్సేంజీ నిల్వలు ఎందుకు తరిగిపోతున్నాయి. డాలర్ ముందు మన రూపాయి విలువ ఎందుకు వెలవెలబోతున్నది. అందుకోసం నూతన ఆర్ధిక విధానం (New Economic Policy) కావాలి. ఈ దేశంలో అద్భుతమైన ప్రకృతి సంపద ఉన్నా.. పచ్చదనానికి కొరత ఎందుకున్నది. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో నూతన పర్యావరణ పాలసీ (New Environmental policy) తేవాల్సి ఉన్నది. అదే సందర్భంలో ఈ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారతంలో సమన్యాయం, సామాజిక న్యాయం ఇంకా జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలకు అభివృద్ధి ఫలాలను ఈ దేశ పాలకులు అందించలేకపోతున్నారు. దళిత, బడుగు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం తెలంగాణ అమలు చేస్తున్న పథకాల స్ఫూర్తితో ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నూతన విధానం (weaker section upliftment policy) తేవాల్సిన అవసరం ఉన్నది.
దేశ జనాభాలో 50శాతం ఉన్న మహిళలను అనేకరకాలుగా వివక్షకు గురిచేస్తూ, దేశ అభివృద్ధిని కుంటు పడేలా చేస్తున్న విధానాలను సమీక్షించుకోవాల్సి ఉన్నది. దేశ ప్రగతిలో మహిళలను మరింత భాగస్వాములను చేసే దిశగా మహిళా సాధికారత విధానం women empowerment policy తేవాల్సి ఉంది. అంతే కాకుండా, విద్య, వైద్యం తదితర మౌలిక వసతుల అభివృద్ధి పరచడానికి ఆయా రంగాల్లో తెలంగాణ స్ఫూర్తితో వినూత్నమైన ప్రగతికాముక విధానాలను రూపొందించి బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది. ఇందుకోసం ఈ విధివిధానాల రూపకల్పన కోసం మాజీ జడ్జీలు ప్రముఖ ఆర్థిక, సామాజిక వేత్తలతో, మేధావులతో కసరత్తు కొనసాగుతున్నదన్నారు.
Read Also: Bus Accident: బ్రేకులు ఫెయిల్.. హైవే పై ఆర్టీసీ బస్సు బీభత్సం