నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం ప్రారంభించారు. మొదట కలెక్టరేట్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా ఏర్పాటు చేసుకున్న తర్వాత బ్రహాండంగా నిర్మల్ కలెక్టరేట్ నిర్మాణం చేసుకున్నం. నేను ప్రారంభించడం జరిగింది. నిర్మల్ జిల్లాలో 396 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా.. ‘ వీటన్నింటికీ ప్రత్యేకంగా ప్రతీ ఒక్క గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలను మంజూరు చేస్తున్నాను. నిర్మల్, ముథోల్(భైంసా), ఖానాపూర్ మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ప్రతీ ఒక్కదానికి ప్రత్యేకంగా రూ.25 కోట్ల చొప్పున మంజూరు చేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లాలో ఉన్న 19 మండల కేంద్రాలున్నవి. వాటన్నింటికీ కూడా ప్రతి మండల కేందానికి రూ.20 లక్షల చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం.
ఈ మధ్య రాష్ట్రంలో వచ్చినటువంటి ఎస్సెస్సీ ఫలితాల్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా నంబర్ వన్ స్థానంలో వచ్చింది. నిర్మల్ జిల్లా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాశాఖను, జిల్లా మంత్రిని, ఎమ్మెల్యేలను మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. బాసర సరస్వతి అమ్మవారి ఆలయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేసుకోబోతావున్నం. రాబోయే కొద్ది రోజుల్లో పునాది రాయి వేసేందుకు నేను రాబోతావున్నాను. చాలా అద్భుతమైన ఆలయం నిర్మించుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను.
Also Read : Mahmood Ali : టెక్నాలజీ వాడకం వల్ల దేశంలో తెలంగాణ పోలీస్ అగ్రస్థానంలో ఉంది
ఒకనాడు మారుమూల జిల్లా అడవి జిల్లా అని పేరున్నటువంటి అదిలాబాద్ జిల్లాలో నాలుగు జిల్లాలు ఏర్పాటు కావటం, అంతకుముందు ఒక మెడికల్ కాలేజీ వచ్చింది. కొత్తగా మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ లో మూడు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఈరోజు పేదల కోసం ప్రభుత్వం నిర్మించిన రెండు వేల డబుల్ బెడ్రూంలకు శంకుస్థాపన చేయడం జరిగింది. అవి కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చినయ్. కులాలకు, మతాలకు, జాతులకు కాకుండా ఎవరు పేదవాళ్లుంటే వాళ్లను ఆదుకోవాలనే ఉద్ధేశ్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నం. గతంలో రెవెన్యూ డిపార్ట్ మెంటులో భయంకరమైన దోపిడీ జరిగింది. ఎవల భూమి ఎవలి చేతిలో ఉంటదో ఎవలికి తెలిసేది కాదు. నిన్న ఉన్న భూమి తెల్లారిటికాల్లకు పహాణీలు మారిపోయేటివి.
ఈమధ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ధరణి పోర్టల్ తీసేసి బంగాళాఖాతంలో వేస్తామంటున్నరు. అంటే మల్ల పైరవీకారులు రావాలె.. మల్ల వీఆర్వోలు రావాలె.. ఇవ్వాల రైతుబంధు వస్తోంది..మీరొక ఆలోచన చేయాలె. రైతు బంధు ఏ విధంగా వస్తది. రైతు బంధు హైదరాబాద్ లో ప్రభుత్వం బ్యాంకులో వేస్తే ఇక్కడ బ్యాంకు నుంచి మీకు టింగు టింగుమని మెస్సేజీలొచ్చి ఇయ్యాల రైతు బంధు వస్తా ఉంది. ఎవలైనా రైతు చనిపోతే ఏ విధంగా రైతు బీమా వస్తా ఉంది?. మీరెవరు కూడా మాట్లాడకుండా..ఒక దరఖాస్తు పెట్టకుండా ఏ ఆఫీసుకు పోయే అవసరం లేకుండా 8 రోజుల్లోపల్నే రూ.5 లక్షల చెక్కు వాళ్ల ఇంటికి వస్తా ఉంది.
ప్రభుత్వమే వడ్లు కొంటే.. ఆ కొన్న వడ్ల డబ్బులకు గతంలో చాలా బాధలు పడేది. వీథికి…అంగడికి పోయేది..మార్కెట్ కమిటీకి పోయేది.. రోజుల తరబడి అక్కడ పడావు పడేది. ఎవరి ఊళ్లెనే వాళ్లే అమ్ముకునే విధంగా 7000 కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ కొన్న వడ్ల డబ్బులు కూడా బ్యాంకులో వేస్తే డైరెక్టుగా మీ అకౌంట్లోకి వస్తా ఉన్నయి. అంటే ధరణి తీసేస్తే ఇవన్నీ జరుగుతయా?. తీసేయాల్నా ధరణి ఉండాల్నా?.. ఎవరైతే ధరణిని బంగాళాఖాతంలో ఏయమన్నరో వాళ్లని బంగాళాఖాతంలో యిసిరికొట్టాలె. ఎవరైతే మల్లా వీఆర్వోలను, పట్వారీలను మల్ల మనల్ని పరేషాన్ చేయడానికి, మన భూములు గోల్ మాల్ చేయడానికి..ఎవలైతే మల్ల దుర్మార్గం చేస్తున్నరో, ఇంత బాహాటంగా చెబుతున్నరో.. ఇండియా మొత్తంల్నే ఎక్కడా లేదు.
నేను ఈ మధ్య మహారాష్ట్ర బోతే ఎట్లా సాధ్యమైతది సర్..డబ్బులు బ్యాంకులో ఎట్లేస్తరు.. కొన్న డబ్బులు కూడా బ్యాంకులేస్తరా..సచ్చిపోతే కూడా బ్యాంకులేస్తరా.. రైతు బంధు కూడా క్రమం తప్పకుండా బ్యాంకులకొస్తదని వాళ్లు ఆశ్చర్యపడతావున్నరు. కానీ ఇక్కడ వున్నటువంటి దుర్మార్గులు..మళ్లీ పాత పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన మనం చూడలేదా.. ఆనాడు వీఆర్వోల దోపిడీ, పహాణీలు మార్చేయడం, భూమి రికార్డులు మార్చేయడం. ఇయ్యాల రిజిస్ట్రేషన్ కావాలంటే పదిహేను నిమిషాలల్లో అయిపోతావుంది. తర్వాత పట్టా కావాల్నంటే పది నిమిషాల్లో అయిపోతావుంది. ధరణి తీసేస్తే మల్ల ఎన్ని రోజులు తిరగాలె..ఎన్ని దరఖాస్తులు పెట్టాలె?
ఈ దుర్మార్గులు 50 ఏండ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించి మంచినీళ్లు కూడా ఇయ్యలే మనకు. ఇయ్యాల ప్రతి ఇంట్లో నల్లా ఫిట్ చేసి బ్రహ్మండంగా గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకుంటా వున్నం. ఎస్సారెస్పీ ఎండిపోకుండా శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకాన్ని పెట్టుకున్నాం. కోట్ల టన్నుల వడ్లు పండించుకుంటా వున్నం. బ్రహ్మాండంగా రైతులందరూ కూడా నిలబడి ఇయ్యాల ధైర్యంగా ముందుకుపోయే పరిస్థితి తెచ్చుకున్నాం.ఈ రాష్ట్రం ఇట్లాగే ఉండాల్నంటే ఖచ్ఛితంగా మీ అందరి మద్ధతు, మీ అందరి ఆశీస్సులు బీఆర్ఎస్ పార్టీకి కావాలె. తప్పకుండా మీ అందరి మద్ధతుతోని మరింత ముందుకు పోవల్సిన అవసరం ఉంది. రాబోయే టర్మ్ లో.. ఎన్నికలైపోయిన తర్వాత ఇయ్యాల ఉన్న పద్ధతి కాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ.. అంటే ధాన్యాన్ని ప్రాసెస్ చేసి అంటే రైతుకు ఇంక ఎక్కువ డబ్బులొచ్చేటట్లు మార్కెట్ కు పంపేవిధంగా కొత్త ప్రణాళికలు ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఏ తాలూకాకు ఆ తాలూకాలోనే ఇబ్బడిముబ్బడిగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టి అక్కడి యువకులందరికీ వాళ్లకి అక్కడనే ఇచ్చేటటువంటి పద్ధతులల్లో ఉద్యోగాలు దొరికే పరిస్థితులు మనం చేస్తా ఉన్నం. మన చెరువులన్నీ కూడా ఒకనాడు ఎండిపోయి గందరగోళంగా ఉండేవి. ఈరోజు చెరువులన్నీ కూడా నింపుకుంటా ఉన్నాం. ఎస్సారెస్పీ నుంచి వచ్చేటటువంటి స్కీం 27, 28 ఏదైతే ఉందో ప్యాకేజి ఉందో..దానిని త్వరలోనే పూర్తి చేయబోతూ ఉన్నాం. ఎస్సారెస్పీ ద్వారా త్వరలోనే మీకు లక్ష ఎకరాలకు నీళ్లు రాబోతావున్నయని నేను మీకు హామీ ఇస్తున్నా. ముథోల్, నిర్మల్ నియోజకవర్గాల ప్రజలకు కూడా నేను తెలియజేస్తావున్న. 8వ తారీఖు నాడు చెరువుల పండుగ జరుపుకుంటా వున్నం. అన్ని గ్రామాలలో..గ్రామాలు గ్రామాలే కోలాహలంగా డప్పులతోని, బాజాభజంత్రీలతోని అందరం చెరువు కట్టమీదకి పోయి.. అక్కడ ప్రభుత్వమే మీకు భోజనం ఏర్పాటు చేస్తది. బ్రహ్మాండంగా చెరువు కట్టల మీద దద్దరిల్లేటట్టుగా చెరువుల పండుగ జరపాలె. అనేక మంచి కార్యక్రమాలు మనం తీసుకున్నాం. పేదవాళ్లను కావొచ్చు..వృద్ధులను కావొచ్చు.. ట్రాన్స్ జెండర్లను కావొచ్చు..ఒంటరి మహిళలను కావొచ్చు..అందర్ని కూడా ఆదుకుంటా వున్నం. దేశంలోనే ఈరోజు పర్ క్యాపిటా ఇన్ కంలో తలమానికంగా అగ్రభాగాన ఉన్నది తెలంగాణ. విద్యుత్ లో..ఒకనాడు కరెంట్ ఎప్పుడు వస్తదో తెల్వదు.. ఎప్పడు పోతదో తెల్వదు..చాలా భయంకరమైన పరిస్థితులుండె. రైతు దగ్గరికి వచ్చి ఇయ్యాల ఎవడు కూడా మిమ్మల్ని..ఎన్ని మోటార్లు పెట్టుకున్నవ్? అని అడిగేవారే లేడియ్యాల. ఒకనాడు కరెంట్ అంటే భయపడే పరిస్థితి. ఇయ్యాల రైతు నిలబడాలని, వ్యవసాయం పండుగ కావాలని, మా రైతుల ముఖాలల్లో చిరునవ్వు ఉండాలని మీరు ఎన్ని మోటార్లు పెట్టుకున్నా కూడా సంవత్సరానికి రూ.12 వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం మీకు ఫ్రీ కరెంట్ ఇస్తా వుంది.
మల్ల ఈ దుర్మార్గులు వస్తే..ఈ కరెంట్ పోతది..రైతుబంధుకు రాంరాం..దళితబంధుకు జైభీం..ఇదే పరిస్థితి వస్తది. రైతు బంధుకు రాంరాం అనేటోడు రావాల్నా? దళితబంధుకు జైభీం అనేటోడు రావాల్నా?.. లేకపోతే మనమే కొనసాగాల్నా ప్రజలు నిర్ణయించాలని నేను కోరతావున్న. ఎలక్షన్లు దగ్గరికొచ్చినయ్ కాబట్టి.. అడ్డంపొడుగు మాట్లాడి, ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మాట్లాడుతరు. మన గోండు సోదరుల గోండు గూడాలు కావొచ్చు.. లంబాడి తాండాలు కావొచ్చు..ఎన్నో సంవత్సరాలు కొట్లాడిండ్రు.. మా గూడాలన్నీ కూడా మంచిగ కావాలని జెప్పి. గ్రామ పంచాయతీలు కావాలని. 60 ఏండ్లల్ల ఎవడన్నా చేసిండా?. ఇయ్యాల ఇక్కడ దాదాపు 196 గ్రామ పంచాయతీలు గిరిజనుల కోసం ఏర్పాటు చేసినం. మావ నాటే మావ రాజ్.. మా తండాలో మా రాజ్యం అని చెప్పి గిరిజన సోదరులు కోరేవాళ్లు..నేను ఆదిలాబాద్ లో తిరిగినప్పుడు. ఇవన్నీ కూడా చేసుకున్నాం. బ్రహ్మాండంగా ఇయ్యాల గిరిజన తాండాలు అభివృద్ధి చెందుతావున్నయి. రాబోయే రోజులల్లో ఎవరికైతే సొంత జాగాలున్నయో.. నియోజకవర్గానికి మూడు వేల చొప్పున గృహలక్ష్మి అనే స్కీం కింద మూడు లక్షలు మంజూరు చేస్తావున్నం. మీరు ఇండ్లు నిర్మించుకోవాలని కోరతావున్నాను. యాదవ సోదరులకు రెండో విడత గొర్రెల పంపిణీ కూడా చేపట్టబోతావున్నం. ఆ సౌకర్యాన్నీ పొందాలని కోరతావున్నాను. ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి నాకో మాట చెప్పారు.. మహారాష్ట్ర మనపక్కనే ఉంది. మీరు కూడా అప్పుడో ఇప్పుడో పోతుంటరు మహారాష్ట్రకు. మహారాష్ట్ర రైతులు మన దగ్గర అర్దెకరం కొని దాంట్లో బోరేసి మహారాష్ట్రల పారిచ్చుకుంటున్నరు..ఏం జేద్ధాం సర్ అన్నరు. బతకనీ తీయ్ విఠల్ రెడ్డి గారూ అని నేనన్నాను. వాళ్లకక్కడ లేదు కాబట్టి మనల్ని అక్కడ అడుగుతావున్నరు అని చెప్పినాను. ఈరోజు మనం ఎంత మంచిగున్నం. మహారాష్ట్ర అంతపెద్ద రాష్ట్రమైనా వాళ్లకంటే వాళ్ల తనదన్ని మనం బ్రహ్మాండంగా వున్నం. ఇయ్యాల మహారాష్ట్రల నేనుబోతే..కేసీఆర్ మాకు నువ్వు రావాలె..అబ్ కి బార్..కిసాన్ సర్కార్..అని బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతావున్నరు.
ఇక్కడ అడ్డం పొడుగు మాట్లాడేటటువంటి ప్రతిపక్షాలు..ఒక పద్ధతీపాడూ లేకుండా ఎటుబడితే అటూ ఆగమాగం చేయడానికి మల్లా వస్తున్నరు. అధికారం నుంచి దూరమైండ్రు కాబట్టి మల్లా అధికారం వస్తే మింగుదామనే ఆలోచనలో ఉన్నరు. తస్మాత్ జాగ్రత్త అని నేను ప్రజలందరినీ హెచ్చరిస్తున్నా. ముస్లిం సోదరీసోదరులందరికీ నేను సలాం చేస్తున్నా. పర్ క్యాపిటా ఇన్ కం గానీ, పర్ క్యాపిటీ యుటిలైజేషన్ గానీ తీసుకుంటే హిందూస్తాన్ లోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నాం. పదేళ్ల కంటే ముందు మనకు తాగేందుకు నీళ్లే దొరికేవి కావు. ఆ సమస్య తీర్చేసుకున్నాం. మన రెసిడెన్షియల్ స్కూళ్లలో మన పిల్లలు ఎంత బాగా చదువుతున్నరో మీరందరూ చూస్తున్నారు. షాదీ ముబారక్, విదేశీ విద్యకు రూ.20 లక్షల స్కాలర్ షిప్, డబుల్ బెడ్రూంలు తదితర పథకాలు అన్నింటిలోనూ ప్రభుత్వం ముస్లింలకు అందిస్తున్నది. చినుకులు పడేటట్లు ఉన్నయ్.. రాండ్రి అని వచ్చే ముందు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నడు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అడిగిండ్రు.. వెనుకబడిన జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజీ కావాలని. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేస్తామని హామీనిస్తున్నాను. గతంలో అదిలాబాద్ జిల్లా అంటే వర్షాకాలం వచ్చిందంటే అంటురోగాలతో మనుషులు చచ్చిపోయేవారు. గత నాలుగైదేండ్ల నుంచి ఆ పరిస్థితి లేదు. పరిశుద్ధమైన మంచినీరు మిషన్ భగీరథ ద్వారా అందుతున్నయ్ కాబట్టి ఆ మరణాల నుంచి ఆ అంటురోగాల నుంచి కూడా మనం బయటపడ్డాం.
నాలుగు మెడికల్ కాలేజీలంటే నాలుగు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తావున్నయి. ఎక్కడికో హైదరాబాద్ కి పోవాల్సిన అవసరం లేదు. ఇంత గొప్పగ జరిగేటటువంటి మన అభివృద్ధిని కొనసాగించుకుంటూ..మన ఐకమత్యాన్ని కొనసాగించుకుంటూ మనందరం కూడా ముందుకుపోదాం. నిర్మల్ లో వాతావరణం చాలా చక్కగా ఉంది.. చినుకులు కూడా మనకు స్వాగతం చెప్పినయ్. మన రైతులను, పేదలను అందరినీ కూడా కాపాడుకుంటూ మనం ముందుకుపోదాం అని తెలియజేస్తూ..గాలిదుమారం వచ్చినా భయపడకుండా ఉండి నాకు ఇంత పెద్ద ఎత్తున స్వాగతం తెలిపి, సభను విజయవంతం చేసిన మీ అందరికీ పేరుపేరునా ధన్యావాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ! జై భారత్!!’ అంటూ సీఎం కేసీఆర్ ప్రసంగం ముగించారు.