ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దక్కిన అరుదైన గౌరవంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ప్రతిష్టాత్మక ‘ఎకనమిక్ టైమ్స్’ సంస్థ ఆయనను ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారానికి ఎంపిక చేయడంపై రాజకీయ, పారిశ్రామిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.
చంద్రబాబు నాయకత్వ శైలి నవతరానికి ఎంతో స్ఫూర్తినిస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన అమలు చేస్తున్న పారిశ్రామిక సంస్కరణలు, పాలనా విధానాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతిపథంలో నిలుపుతాయని కొనియాడారు. ఈ అవార్డు చంద్రబాబు ఒక్కరికే కాదు, మొత్తం రాష్ట్రానికే గర్వకారణమని, దీనివల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ లభిస్తుందని డిప్యూటీ సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. టైటిల్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా సీఎం చంద్రబాబు ఈ అవార్డును అందుకోనున్నారు. అవార్డు రావడం పట్ల మంత్రులు, అధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. తనకు లభించిన ఈ గౌరవంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ పురస్కారం తన ఒక్కడిది కాదని, ఇది తన సహచర మంత్రులు, ఐఏఎస్ అధికారులు , జిల్లాల కలెక్టర్ల సమష్టి కృషి వల్ల దక్కిన ఫలితమని ఆయన పేర్కొన్నారు.