గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆగడాలతో ఐదేళ్ల పాటు జనాలు సరిగా గణేష్ ఉత్సవాలు కూడా జరుపుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు డూండీ గణేష్ ఉత్సవాలు జరగనివ్వకుండా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. వినాయకుడు అంటే తమషా కాదు అని.. వడ్డీతో సహా వసూలు చేస్తాడు అని వార్నింగ్ ఇచ్చారు. డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో సితార సెంటర్‌లో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాశక్తి గణపతిని సీఎం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
‘గతంలో ఐదేళ్ల పాటు జనాలు గణేష్ ఉత్సవాలు కూడా ఆనందంగా జరుపుకోలేకపోయారు. గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు డూండీ గణేష్ ఉత్సవాలు జరగనివ్వకుండా ప్రవర్తించారు. అందుకే ఎటువంటి పర్మిషన్లు లేకుండా మేం గణేశ్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఇది మా ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం. గణేశుడికి దొంగ దొంగతనంగా దణ్ణాలు పెడితే మీరు చేసిన పాపాలు మాఫీ కావు. వినాయకుడు అంటే తమషా కాదు, వడ్డీతో సహా వసూలు చేస్తాడు. భక్తితో ప్రార్ధిస్తే ఎక్కడ అవరోధాలు ఉండవు. అపహాస్యం చేస్తే మాత్రం వారి జీవితాల్లో అడుగడుగునా అడ్డంకులు తెచ్చి జీవితంలో పైకి రాకుండా చేస్తాడు’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
Also Read: CM Chandrababu: ఏపీకి ఎలాంటి ఇబ్బందులు రాకూడని వినాయకుడిని కోరుకున్నా!
‘వినాయక చవితి చేయాలంటే ఇప్పటివరకు మైక్, కరెంట్‌కు పర్మిషన్లు పెట్టుకోవాలనే నిబంధన ఉండేది. ఈసారి పర్మిషన్లు లేకుండా మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా ఇచ్చాం. గతంలో గణేష్ ఉత్సవాలు జరగాలంటే అన్నీ విఘ్నాలు ఎదురయ్యేవి, మా ప్రభుత్వం వచ్చాక అంతా సాఫీగా సాగుతోంది. ఉచితంగా కరెంట్ ఇవ్వటానికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబితే.. పర్లేదు అని చెప్పాను. గణేశ్ ఉత్సవాలలో అపశృతి లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వినాయకుడిని కోరుకున్నా’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.