CM Chandrababu Visits 72 ft Ganesh idol in Vijayawada: బెజవాడలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహంను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. భవిత్యత్తులో ఏపీకి ఏ ఇబ్బందులు రాకుండా తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కార్యసిద్ధి గణపతిని ప్రార్ధించాను అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
‘చిన్నప్పటి నుంచి నేను కూడా గణేష్ మహోత్సవాలు నిర్వహించేవాడిని. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటే.. విఘ్నాలు తొలగించి వాటిని ఇచ్చే శక్తి ఉన్న దైవం వినాయకుడు. దేశమంతా వాడవాడలా జరిగే పండుగ గణేష్ చతుర్ధి. వినాయక చవితి చేయాలంటే ఇప్పటి వరకు మైక్, కరెంట్‌కు పర్మిషన్లు పెట్టుకోవాలని నిబంధన ఉండేది. ఈసారి పర్మిషన్లు లేకుండా మండపాలకు విద్యుత్ సరఫరా ఉచితముగా ఇచ్చాం. గణేష్ ఉత్సవాలు జరగాలంటే గతంలో అన్నీ విఘ్నాలు ఎదురయ్యేవి. మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వటానికి రూ.30 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెబితే.. పర్లేదు ఇవ్వండి అని చెప్పాను. గణేశ్ ఉత్సవాలలో అపశృతి లేకుండా చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిది. 72 అడుగుల మట్టి గణపతిని ఇక్కడే నిమజ్జనం చేయటం విశేషం’ అని సీఎం చెప్పారు.
Also Read: 1 Ball 22 Runs: అత్యంత ఖరీదైన డెలివరీ.. ఒక్క బంతికి 22 రన్స్! వీడియో వైరల్
‘రానున్న రోజుల్లో ప్రకృతి అంతా కలుషితం అయ్యే పరిస్థితులు వచ్చాయి. ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛంద్ర కార్యక్రమం తెచ్చాము. గత ఏడాది వరదలు వస్తే సమర్ధవంతంగా ఎదుర్కొని పునరావాసం కల్పించాము. బుడమేరు వరద రాకుండా అన్ని చర్యలు చేపట్టాం.1500 టీఎంసీలు గోదావరి ద్వారా సముద్రంలో కలిసాయి. రాష్ట్రంలో కరువు లేకుండా పండుగ జరుపుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశారు. దేశంలో ఎక్కడ జరగని అభివృద్ధి ఏపీలో జరుగుతోంది. 2047నాటికి ఏపీ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధ్యం అయ్యేలా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.