CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా, బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలిన ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై సీఎంఓ అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు కంపెనీ నుండి పరిహారం అందేలా చూడడంతో పాటు ప్రభుత్వం నుండి కూడా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Read Also: Vijayawada: పెట్రోల్ బంకులో పెట్రోల్‌కు బదులు నీళ్లు.. ఆందోళనకు దిగిన వాహనదారులు
ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలడంతో దాదాపు 15 మంది కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వాసులుగా గుర్తించారు. క్షతగాత్రులను జగ్గయ్యపేట, విజయవాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాయిలర్ పేలిన ఘటనలో క్షతగాత్రులను ఆల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహంతో కంపెనీ కార్యాలయంపై దాడి చేశారు. కార్యాలయంపై దాడి ఘటనలో గ్రామస్థులు అద్దాలను ధ్వంసం చేశారు. ఘటనా స్థలంలో విచారణ చేపట్టి పోలీసు వివరాలు నమోదు చేశారు.