CJP Protests: మా 4 డిమాండ్లలో రెండింటికి కేంద్రం అంగీకారం.. ఆందోళనపై CJP తాజా ప్రకటన..

Abhijeet Dipke

Abhijeet Dipke

CJP Protests: నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) మరోసారి స్పష్టం చేసింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ, ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేసే వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనలను విరమించబోమని ప్రకటించారు. అయితే, 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ దీక్ష విరమించడం సంతోషకరమని అభిజీత్ దిప్కే అన్నారు. దేశానికి వాంగ్‌చుక్ జీవితం ఎంతో విలువైనదని పేర్కొంటూ, ఆయన దీక్ష ముగిసినా ఉద్యమం మాత్రం ఆగదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో తటస్థ వేదికలో చర్చలు జరగనున్నాయని దిప్కే వెల్లడించారు. చర్చలు సానుకూలంగా సాగినా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. “ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మరో పరిష్కారం మాకు ఆమోదయోగ్యం కాదు” అని దిప్కే స్పష్టంచేశారు. అయితే తమ నాలుగు ప్రధాన డిమాండ్లలో రెండింటికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా స్పందించిందని ఆయన తెలిపారు. జంతర్ మంతర్‌లో జరిగిన నిరసనల్లో పాల్గొన్న CJP కార్యకర్తలపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చిందని చెప్పారు. అలాగే, నీట్-యూజీ 2026 పేపర్ లీక్ ఘటనతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించేందుకు కూడా కేంద్రం అంగీకరించినట్లు పేర్కొన్నారు.

మరోవైపు, దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు కొనసాగించాలని CJP పిలుపునిచ్చింది. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి చట్టబద్ధమైన అనుమతులతో నిరసనలు నిర్వహించాలని కోరింది. విద్యార్థుల డిమాండ్లను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని పార్టీ నాయకత్వం సూచించింది. అభిజీత్ దిప్కే వ్యాఖ్యలతో కేంద్రంతో జరగనున్న చర్చలపై ఆసక్తి నెలకొంది. అయితే ప్రధాన డిమాండ్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నెరవేరే వరకు జంతర్ మంతర్‌లోని తమ ఆందోళనను కొనసాగిస్తామని CJP తేల్చిచెప్పింది.