CJI Justice DY Chandrachud: చిన్నారులపై కొనసాగుతున్న లైంగిక వేధింపులపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. యునిసెఫ్‌తో కలిసి జువెనైల్ జస్టిస్‌పై సుప్రీంకోర్టు కమిటీ నిర్వహించిన పోక్సో చట్టంపై ఢిల్లీలో రెండు రోజుల జాతీయ సదస్సులో శనివారం పాల్గొన్న సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ ప్రసంగించారు. 18 ఏళ్ల లోపు వారు ఏకాభిప్రాయంతో లైంగిక కార్యకలాపాలకు పాల్పడినా పోక్సో చట్టం ప్రకారం నేరమేనని ఆయన వెల్లడించారు. పోక్సో చట్టం ప్రకారం సమ్మతి వయస్సుకు సంబంధించి పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించాలన్నారు. పిల్లలపై లైంగిక అకృత్యాల అంశంలో సమాజంలో పెనుసమస్యగా తయారైందని సీజేఐ ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్నారి లైంగిక హింసకు గురైనప్పుడు ఆ విషయాన్ని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయకుండా బాధిత కుటుంబం మౌనంగా ఉంటున్న సందర్భాలే ఎక్కువ ఉంటున్నాయన్నారు. ఈ సంస్కృతి మారాలని.. నిందితుడు సొంత కుటుంబసభ్యుడైనా సరే ఫిర్యాదు చేసేలా బాధిత కుటుంబాల్లో ధైర్యం, చైతన్యం, అవగాహన పెరగాలన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వాలే ముందుకు రావాలని.. బాధిత చిన్నారుల వేదన వెంటనే తీర్చలేని స్థితిలో, తక్షణ న్యాయం చేకూర్చలేని స్థితిలో మన నేర శిక్షాస్మృతి ఉందనేది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. దీనికి పార్లమెంట్‌లో చట్ట సవరణ ద్వారా ప్రభుత్వమే సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నారు. చిన్నారులు లైంగిక వేధింపుల బారిన పడకుండా ముందుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం చాలా ముఖ్యమన్నారు. సురక్షితమైన స్పర్శ, అసురక్షిత స్పర్శ మధ్య తేడాను పిల్లలకు తప్పనిసరిగా నేర్పించాలని ఆయన అన్నారు.
Himachal Pradesh CM: పాలమ్మే స్థాయి నుంచి పాలించే స్థాయికి.. హిమాచల్ నూతన సీఎం విజయ ప్రస్థానం
బాధితుల కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి చాలా వెనుకాడుతున్నారని, అందువల్ల పోలీసులకు అధిక అధికారాలు అప్పగించడం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సీజేఐ అన్నారు. అన్నింటికీ మించి, పిల్లల శ్రేయస్సు కంటే కుటుంబం గౌరవానికి ప్రాధాన్యత ఇవ్వబడకుండా చూసుకోవడం తక్షణ అవసరమన్నారు. నేర న్యాయ వ్యవస్థ కొన్నిసార్లు బాధితుల మానసిక క్షోభను పెంచే విధంగా పనిచేయడం దురదృష్టకరమని, కాబట్టి అలా జరగకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ న్యాయవ్యవస్థతో చేతులు కలపాలని సీజేఐ చంద్రచూడ్ అన్నారు.