CID Search Operation: రాష్ట్రవ్యాప్తంగా మద్యం డిస్టలరీల్లో సీఐడీ బృందాల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో వివిధ డిస్టలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం లెక్కలపై సీఐడీ బృందాలు ఆరా తీస్తోంది. డిస్టలరీల నుంచి నేరుగా నేతలకు మద్యం సరఫరా చేశారనే కోణంలో పరిశీలిస్తున్నారు. డిస్టలరీల యాజమాన్యం వెనుక బినామీలు ఉన్నారానే కోణంలో విచారణ జరుగుతోంది. 2014 – 2019 మధ్య కాలంలో టీడీపీ అనుమతులు ఇచ్చిన డిస్టలరీలను పలువురు వైసీపీ నేతలు చేజిక్కించున్నారనే ఫిర్యాదులపై విచారణ జరుగుతోంది. డిస్టలరీల నుంచి బెవరేజ్ కార్పొరేషన్‌కు మాత్రమే కాకుండా అనధికార సరఫరాపై సీఐడీ ఫోకస్ పెట్టింది. రికార్డుల పరిశీలన, ఆధారాల సేకరణపై సీఐడీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది.
Read Also: Minister Narayana: కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో మంత్రి నారాయణ భేటీ
రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ డిస్టలరీలలో సీఐడీ తనిఖీలు చేపట్టింది. అనకాపల్లి జిల్లా కశింకోట(మం) సుందరయ్య పేట దగ్గర వున్న విశాఖ డిస్టలరీ, జీఎస్‌బీ డిస్టలరీలో రికార్డులను అధికారులు పరిశీలించారు. తలుపు మూసివేసి లోపలికి అనుమతించకుండా సోదాలు చేపట్టారు. 2019- 24 మధ్య తయారైన లిక్కర్ నాణ్యత పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల క్రితం ఎక్సైజ్ – సీఐడీతో జాయింట్ కమిటీలను ఏర్పాటు చేసింది. వివిధ డిస్టలరీలలో తయారైన మద్యం శాంపిల్స్ ను ఈ టీంలో సేకరించాయి. వీటికి సంబంధించిన కెమికల్ ఎనాలసిస్ రిపోర్టులు ప్రభుత్వానికి చేరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రికార్డుల తనిఖీలు కీలకంగా మారాయి. సుందరయ్యపేట డిస్టలరీలలో తయారయ్యే బ్రాండ్లు వైసీపీ ముఖ్య నేత కంపెనీకి చెందినవిగా టీడీపీ ఆరోపించింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. సోదాలకు గల కారణాలను సీఐడీ కానీ ఎక్సైజ్ శాఖ కానీ నిర్ధారించడం లేదు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ డీకే పల్లి సమీపంలోని వ్యాంటేజీ డిస్లరీలో సీఐడీ అధికారులు తనిఖీలు జరిపారు. కడప నగర సమీపంలోని ఈగల్ డిస్టలరీస్‌లో నాలుగు బృందాలు తనిఖీలు చేశాయి. 9 సీ హార్స్ చీప్ లిక్కర్ తయారీ కంపెనీపై సీఐడీ సోదాలు చేపట్టింది. గత ఐదు సంవత్సరాలలో ఎంత తయారు చేశారు.. ఎంత ప్రభుత్వానికి సరఫరా చేశారు, అన్న రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం కోటపాడు శివారు పీఎంకే డిస్టిలేషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీలో కూడా సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం కరకంబాడి సమీపంలోని ఎస్వీఆర్ డిస్టిలరీస్‌పై దాడులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా సింగారయకొండ మండలం పాత సింగరాయకొండ పరిధిలోని పెరల్ డిస్టిలరీని సీఐడీ అధికారులు తనిఖీలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి సెంటనీ బయోటెక్ కర్మాగారంలో మద్యం బాటిలింగ్ యూనిట్‌లో సీఐడీ అధికారుల సోదాలు జరిగాయి. నంద్యాలలోని ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్‌ను అధికారులు పరిశీలించారు.