China Great Green Wall: ఎడారిలో పచ్చదనం కనిపిస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా.. కానీ చైనా శాస్త్రవేత్తలు దానిని నిజం చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఎడారులను పచ్చగా మార్చడానికి చైనా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. వాయువ్య చైనాలో శాస్త్రవేత్తలు ప్రత్యేక నీలి-ఆకుపచ్చ ఆల్గే (సైనోబాక్టీరియా)ను వ్యాప్తి చేసి పచ్చదనాన్ని సృష్టించే ప్రక్రియను ముమ్మరం చేస్తున్నారు. ఈ ప్రత్యేక ఆల్కే అనేది దీర్ఘకాలం వేడి, కరువును తట్టుకోగలదని చెబుతున్నారు. ఇది వర్షాకాలంలో వేగంగా పెరుగుతుంది, అలాగే ఇసుక ప్రాంతాలలో బలమైన, బయోమాస్-రిచ్ పొరను ఏర్పరుస్తుందని డ్రాగన్ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ పొర ఇసుక దిబ్బలపై భవిష్యత్తులో మొక్కల పెరుగుదలకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తుందని అంటున్నారు.
READ ALSO: China: న్యూ ఇయర్ నుంచి కండోమ్ ధరలు పెంచుతున్న చైనా.. ఎందుకో తెలుసా!
ఈ ప్రాజెక్టుకు చైనా గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టింది. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఈ టెక్నాలజీని ఇంత పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్న దేశంగా డ్రాగన్ దేశం రికార్డు సృష్టించింది. ఎడారీకరణను నివారించడానికి చెట్లను నాటడానికి చైనా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆఫ్రికా, మంగోలియాకు కూడా విస్తరిస్తోంది. ఈ బయోటెక్నాలజీ ప్రపంచంలోని ఎడారులలో ఎక్కువ భాగాలను మార్చగల సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్ట్ కలిగి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ టెక్నాలజీ ఎలా పని చేస్తుంది..
శాస్త్రవేత్తలు ఈ సాంకేతికతను నింగ్క్సియా ప్రాంతంలోని షాపోటౌ ఎడారి పరిశోధనా కేంద్రంలోని అభివృద్ధి చేశారు. వారు ఏడు నిర్దిష్ట రకాల ఆల్గేలను ఎంచుకుని, వాటికి సేంద్రియ ఎరువులు, సూక్ష్మ కణాలతో కలిపి చిన్న నేల లాంటి బ్లాక్‌లను ఏర్పరిచారు. ఎడారిలో చెల్లాచెదురుగా ఉన్నప్పటి కంటే, వర్షం తర్వాత ఆల్గే వేగంగా పెరిగి, స్థిరమైన నేల పొరను ఏర్పరుస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ జీవ పొరను సైనోబాక్టీరియల్ క్రస్ట్ అని కూడా అంటారని చెప్పారు. ఈ ఆల్కే వ్యవస్థ బలమైన గాలులను తట్టుకోగలదని, ఎడారులలో కూడా నేల స్థిరత్వాన్ని కాపాడుతుందని వివరించారు. గతంలో సహజ నేల క్రస్ట్ ఏర్పడటానికి 5-10 సంవత్సరాలు పట్టింది, కానీ ఈ సాంకేతికత కేవలం ఒక సంవత్సరంలోనే స్థిరమైన క్రస్ట్‌ను సృష్టిస్తుందని పేర్కొన్నారు.
1955లో స్థాపించిన షాపోటౌ ఎడారి పరిశోధనా కేంద్రం చైనా మొట్టమొదటి ఎడారి పరిశోధనా కేంద్రం. ఇసుకను స్థిరీకరించడంలో సహాయపడే స్ట్రా చెకర్‌బోర్డ్ సాంకేతికతను శాస్త్రవేత్తలు మొదట ఇక్కడే అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనా కేంద్రం పద్ధతులను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అమలు చేస్తున్నారు. నిజానికి చైనా చేపట్టిన ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ నాలుగు దశాబ్దాల నాటిది. ఈ ప్రాజెక్టులో భాగంగా జూలైలో చైనా మూడు ఎడారులను 94,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో, 1,856 కిలోమీటర్ల పొడవైన ఇసుక నియంత్రణ బెల్ట్‌ను పూర్తి చేసింది. గత నాలుగు దశాబ్దాలుగా ఉత్తర చైనాలోని ఎడారి ప్రాంతాలలో ఇసుక వరదలు, దుమ్ము తుఫానులు, నేల కోతను గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ గణనీయంగా అరికట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
READ ALSO: New Year January 1 History: జనవరి 1నే న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటారో తెలుసా?