ఆదివాసీ సంఘాలు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఆదివాసీ సమస్యలను ఆదివాసీ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ అవకాశాలు, ఆర్ధిక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో రోడ్డు రవాణా, సాగు, తాగునీటి సరఫరాను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎంకు విన్నవించారు. అంతేకాకుండా.. ఐటీడీఏలను బలోపేతం చేయాలని ఆదీవాసీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
Bengaluru: దారుణం.. కుక్కను కారుతో ఢీకొట్టి చంపిన డిజిటల్ కంటెంట్ క్రియేటర్
ఈ సందర్భంగా.. ఆదివాసీ సంఘాలు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొట్టమొదటి సభ ఇంద్రవెల్లిలోనే పెట్టామని అన్నారు. ఇంద్రవెల్లి అమరుల స్తూపాన్ని స్మృతి వనంగా మార్చాలని, అమరుల కుటుంబాలకు ఇండ్లు మంజూరు చేయాలని చర్చించుకున్నామని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పూర్తి చేసుకున్నాం.. రాజకీయంగానూ ఆదివాసీలకు న్యాయం చేస్తూ ముందుకు వెళుతున్నామని చెప్పారు. ఈ సందర్భంగా.. ఆదివాసీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. ఆదివాసీల విద్య, ఉద్యోగ, ఆర్ధిక అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కొమురం భీమ్ వర్ధంతి, జయంతులను అధికారిక ఉత్సవంగా నిర్వహించాలని అధికారులను ఆదేశిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివాసీల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్, మౌలిక సదుపాయాలను వెంటనే మంజూరు చేస్తున్నామన్నారు. ఆదివాసీల మాతృ భాషలో విద్యను అందించే అంశాన్ని అధ్యయనం చేయండని అధికారులకు తెలిపారు.
PM Modi: జిన్‌పింగ్ గుజరాత్ పర్యటన వెనక చరిత్ర.. వెల్లడించిన ప్రధాని మోడీ..
విదేశాల్లో చదువుకునే ఆదివాసీ విద్యార్థులకు సంబంధించి పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్ షిప్స్‌ను క్లియర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మంజూరైన బీఈడీ కళాశాలకు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోండని చెప్పారు. ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆదివాసీ రాయి సెంటర్లకు భవనాలు నిర్మించేందుకు అధ్యయనం చేసి రిపోర్టు అందించాలి.. కేస్లాపూర్ జాతరకు నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం ఇచ్చారు. ఉద్యమాల్లో ఆదివాసీలపై పెట్టిన కేసులు తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం చెప్పారు. గోండు భాషలో ప్రాథమిక విద్యను అందించే అంశంపై అధ్యయనం చేసి రిపోర్ట్ అందించాలని అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఐటీడీఏ ప్రాంతాలకు ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందిర జలప్రభ ద్వారా ఉచితంగా బోర్లు వేసేందుకు చర్యలు చేపట్టాలి.. స్పెషల్ డ్రైవ్ గా తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.