Chicken Price: మాంసాహార ప్రియులకు చేదువార్త ఇది. గత కొన్ని రోజులగా ఏపీ, తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎండలతో పాటు చికెన్ రేట్లు కూడా మండిపోతూ సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. కిలో చికెన్ ధర ‘ట్రిపుల్’ సెంచరీ దాటింది. గుడ్డు ధరా అంతకంతకూ ‘ఎగ్’ బాకుతోంది. మొన్నటి వరకూ ఎండల మంట ఇప్పుడు చికెన్ ధరలపై పడింది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు తగ్గి, వాతావరణం కొంత చల్లబడినా కూడా చికెన్ ధరలు పెరుగుతూపోతున్నాయి. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.300 పలుకుతోంది. పెరిగిన ధరలతో మాంసాహార ప్రియులు అయ్య బాబోయ్ అంటున్నారు.
Read Also: Kidnap: ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేయించిన చిన్న కోడలు.. చివరకు!
మండుటెండలకు బ్రాయిలర్ కోళ్లు చనిపోవడం, తగినంత దాణా తీసుకోకపోవడం వంటి కారణాలతో కోళ్ల బరువు పెరగలేదు. ఇది చికెన్ ధర పెరగడానికి కారణాలుగా ఫౌల్ట్రీ రైతులు పేర్కొంటున్నారు. ఫలితంగా కిలో ధర రిటైల్ మార్కెట్లో రూ.300 పలికింది. ఆదే స్కిన్‌లెస్ అయితే కిలో రూ.320 వరకూ విక్రయిస్తున్నారు. చికెన్ ధరలు పెరిగి రాజమండ్రి మార్కెట్ వెలవెలబోతుంది. వేసవిలో నీటి కొరత, తీవ్రమైన వేడి కారణంగా పౌల్ట్రీ ఫామ్‌లలో ఉన్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయని.. దీంతో కోళ్ల పెంపకం చాలా కష్టమైపోయిందని పౌల్ట్రీ రైతులు చెప్తున్నారు. దీంతో.. కోళ్ల సరఫరాపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అదనంగా పెరిగిన రవాణా ఖర్చులు కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయని చెప్పారు.