తిరుమలలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని అఖరి మెట్లు వద్ద రెండు చిరుతలు సంచరించాయి. చిరుతలను చూసిన భక్తులు భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో చిరుతలు అడవిలోకి పారిపోయాయి. సంఘటన స్థలానికి చేరుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ఆ ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు.చిరుత జాడలను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. భక్తులను గుంపులు గుంపులుగా పంపుతోంది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు.
READ MORE: Pune: బాలుడి డ్రైవింగ్‌తో ఇద్దరి మృతి.. 15 గంటల్లో బెయిల్.. కోర్టు ఏం చెప్పిందంటే..!
కాగా.. గతేడాది తిరుమల కాలి నడక మార్గంలో చిరుత దాడిలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) అధికారులు అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో చిరుత సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుత పులులను బందిస్తున్నారు. అయితే, కాలి నడకన తిరుమల వెళ్లే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని గుంపులు గుంపులుగా ఏర్పాటు చేసి వారి చేతికి ఊత కర్రలను అందించి మెట్లు మార్గంలోకి టీటీడీ అనుమతి ఇస్తుంది. ఈ నేపథ్యంలో మరో సారి చిరుత సంచరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ఏడాది మార్చిలో కూడా ట్రాప్ కెమెరాలకు చిరుత పులి కదలికలు చిక్కాయి. దీంతో పాటు అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ విస్తీర్ణం తక్కువగా ఉండటంతో చిరుతలు తిరుమల కొండకు చేరుకుంటున్నాయని అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.