NTV Telugu Site icon

Big Breaking: నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3

Chandrayaan 3

Chandrayaan 3

Chandrayaan-3 Mission: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ -ఇస్రోతో పాటు యావత్‌ భారత్ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. జాబిలిపై అడుగు పెట్టాలన్న భారత చిరకాల స్వప్నం ఈరోజు కార్యరూపం దాల్చింది. జాబిల్లిపై అన్వేషణకు ‘చంద్రయాన్‌-3’ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి ల్యాండర్‌, రోవర్‌, ప్రొపల్షన్‌ మాడ్యూల్‌తో కూడిన చంద్రయాన్‌-3ని అత్యంత శక్తిమంతమైన ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌ నింగిలోకి మోసుకెళ్లింది. ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు ఈ అద్భుతం ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ రాకెట్‌ చంద్రయాన్‌-3ని భూమి చుట్టూ ఉన్న 170X36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టనుంది. ఇది 24 రోజులు పుడమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను పెంచుతూ.. చంద్రుడి దిశగా లూనార్‌ ట్రాన్స్‌ఫర్‌ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్‌-3ని పంపిస్తారు.

Also Read: CHANDRAYAAN-3 Mission Launch LIVE : శ్రీహరికోట నుంచి చంద్రయాన్-3 ప్రయోగం.. ప్రత్యక్షప్రసారం

కాగా ప్రయోగానికి 25 గంటల పై చిలుకు కౌంట్‌డౌన్‌ గురువారం మధ్యాహ్నం 1.05కు మొదలైంది. ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ దేశమూ వెళ్లని చంద్రుడి రెండో వైపుకు ల్యాండర్, రోవర్‌లను పంపనున్నారు. దాంతో అన్ని దేశాల చూపూ భారత్‌వైపే ఉంది. అందుకే ఈసారి గురి తప్పొద్దనే పట్టుదలతో ఇస్రో సకల జాగ్రత్తలూ తీసుకుంది. ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ బుధవారం నుంచీ షార్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలతో సమీక్షించారు.ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్‌ మాత్రం చంద్రయాన్‌–1 నుంచి తాజా చంద్రయాన్‌–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్‌–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించనున్నారు. ఇందుకోసం ఇస్రో శాస్త్రవేత్తలు 2 నెలలుగా అహర్నిశలు శ్రమిస్తున్నారు.