Chandrababu: ఎన్నికల వేళ నేతలు ప్రచార జోరును పెంచారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కౌతాళం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రాలయంలో మార్పు వస్తోంది.. మంచి రోజులు వస్తున్నాయని ఆయన అన్నారు. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రాలయం, ఆదోనిలో అన్నదమ్ములు దోచుకుంటున్నారని.. తుంగభద్ర నదిలో ఇసుక మాఫియా దోచుకుంటోందని చంద్రబాబు విమర్శించారు. జగన్ పాదయాత్రలో తలపై చెయ్యిపెట్టి, ముగ్గులు నిమిరి , ముద్దులు పెట్టి మోసం చేశారని విమర్శలు గుప్పించారు. రూ.10 ఇచ్చి ప్రజలపై భారం వేసింది రూ.వంద, దోచించి రూ.వెయ్యి అని ఆరోపించారు. కరెంటు చార్జీలు 9 సార్లు పెంచారని.. కరెంటు చార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామన్నారు. నా మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే అని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ మేనిఫెస్టోలో యువతకు ఏమైనా ఇచ్చారా….ఏమైనా అర్థమైందా అంటూ ప్రశ్నించారు.
Read Also: Andhra Pradesh: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం
టీచర్లకు, హోమ్ గార్డులకు, పెన్షనర్లకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్, సూపర్ సక్సెస్.. జగన్ మేనిఫెస్టోకి జీరో మార్కులు అంటూ ఎద్దేవా చేశారు. అమ్మ ఒడి పథకం కింద ఎంత మంది ఉంటే అంతమంది విద్యార్థులకు 15 వేలు చొప్పున ఇస్తామన్నారు. నా జీవితంలో పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది తన ఆకాంక్ష అని పేర్కొన్నారు. రైతు రాజు కావాలి, కూలి కాకూడదు, రైతు వలస వెళ్లరాదన్నారు. వంద సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన దుర్మార్గుడు జగన్ అంటూ చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు.