Andhra Pradesh: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో వచ్చే నెల అనగా మే 1నే పెన్షన్లు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ చేయాలని పేర్కొంది. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు ఉండగా.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ చేయనున్నారు. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కలెక్టర్లను ఆదేశించారు. బ్యాంక్ అకౌంట్లు లేనివారు, దివ్యాంగులు, రోగులకు మే 5 లోపు ఇంటివద్దే పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశించారు.
Read Also: YS Bharathi Reddy: పులివెందులలో వైసీపీ మెజారిటీని ఎవరూ అడ్డుకోలేరు..
కాగా.. ఇంతకు ముందు వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పెన్షన్ పంపిణీ నుంచి పక్కన పెట్టిన ఈసీ.. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం విదితమే. ఈసీ ఆదేశాల నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విధివిధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు.