Chandrababu: మార్కాపురం మారుమోగిపోయిందని.. మార్కాపురంలో వచ్చిన స్పందన తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. జనం నాడి తెలిసిపోయిందని.. వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందన్నారు. బటన్ నొక్కానని ముఖ్యమంత్రి రోజూ మాట్లాడుతున్నారు.. జగన్‌కి బటన్ నొక్కింది ఎంత.. బొక్కింది ఎంతో సమాధానం చెపే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు. వెలుగొండకు ఫౌండేషన్ వేసింది తానేనని.. వెలుగొండ ప్రాజెక్టు పనులు నత్తనడకన చేశారన్నారు. తాను అధికారంలో ఉండి ఉంటే వెలుగొండ నుంచి 2020కే నీళ్లు వచ్చేవన్నారు.
Read Also: Perni Nani: సిటిజన్ ఫర్ డెమోక్రసీ.. టీడీపీ, బీజేపీల బినామీ
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గుద్దులే గుద్దులు…బాదుడే బాదుడు… కేసులే కేసులు అని విమర్శించారు. మూడు ముక్కల ఆట ఆడి అసలు రాజధాని లేకుండా చేశాడన్నారు. వెలుగొండ నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. పరదాలు కట్టుకుని వెలుగొండ ప్రాజెక్టు వద్దకి జగన్ వచ్చి వెళ్లాడని ఆయన విమర్శించారు. దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇదన్న ఆయన.. తానే ఫౌండేషన్ వేశానని.. తానే నీళ్ళు ఇస్తా.. మీ సమస్య పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు.ఎన్నికల తరువాత మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంలో 25 వేల కోట్ల రూపాయలు ఏషియా పల్ప్ ఫ్యాక్టరీ తీసుకువస్తే…అదికూడా పారిపోయే పరిస్థితి వచ్చిందన్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: వాలంటరీ వ్యవస్థపై చంద్రబాబుకు కక్ష.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు మాట్లాడుతూ.. “2014-19లో సంక్షేమానికి పెద్ద పీఠ వేసింది టీడీపీ. సంక్షేమం పేరు చెబితే గుర్తుకొచ్చేది టీడీపీ. 2014-19లో సంక్షేమానికి 19 శాతం ఖర్చు చేస్తే…జగన్ ఖర్చు పెట్టింది 15 శాతమే. విదేశీ విద్యా, రంజాన్ తోఫా, పండుగ కానుక లాంటి 100 సంక్షేమాలు పెట్టిన పార్టీ టీడీపీ. నవరత్నాలు పేరుతో జగన్ నవ మోసాలు చేశాడు. జగన్ బటన్ నొక్కుడు వలన 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. 200 రూపాయలు విద్యుత్…ఇప్పుడు వెయ్యి రూపాయలు. జగన్ బటన్ నొక్కుడు వలన పెట్రోలు, డీజీల్, సేల్ ట్యాక్స్, ఆస్థి పన్ను, ఆర్టీసీ ఛార్జీలు, చెత్తపన్ను పెరిగాయి.జాబ్ క్యాలెండర్ కి బటన్ ఎందుకు నొక్కలేదు. జాబ్ కావాలంటే…బాబు రావాలి. గంజాయి కావాలంటే…జగన్ రావాలి. తాగు నీళ్లు కావాలని అడిగితే జే బ్రాండ్ మద్యం తీసుకువచ్చాడు. సీపీఎస్ రద్దుకి బటన్ నొక్కాడా.. మద్యపాన నిషేధానికి బటన్ నొక్కాడా.. గుంటలు పడిన రోడ్లు రిపేర్లకు బటన్ నొక్కాడా.. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి బటన్ నొక్కాడా.. రైతులకు డ్రిప్పు ఇచ్చేందుకు బటన్ నొక్కాడా.” అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.