CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

Cm Chandrababu

Cm Chandrababu

1996 మార్చి 5న ముఖ్యమంత్రిగా వెలిగొండ ప్రాజెక్టుకు పునాది వేసిన తాను, సరిగ్గా 30 సంవత్సరాల తరువాత 2026 ఆగస్టు 31న మొదటి దశను ప్రారంభించి జాతికి అంకితం చేయడం జీవితంలో మర్చిపోలేని అత్యంత భావోద్వేగ సందర్భమని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి, శ్రీశైలం మల్లన్న సన్నిధి నుంచి బయలుదేరిన కృష్ణమ్మను మార్కాపురం చెన్నకేశవుడు కొలువైన నేలకు తీసుకువచ్చి జలహారతి ఇవ్వడం తన అదృష్టమని తెలిపారు. ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లు, ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు, నిర్వాసిత కుటుంబాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు వెల్లడించారు.

శ్రీశైలం జలాశయంలోని కొల్లం వాగు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తరలించే ఈ ప్రాజెక్టు మొదటి దశను రూ.7,983 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని, దీనివల్ల నల్లమల సాగర్‌కు 10.70 టీఎంసీల నీరు చేరుతుందని వివరించారు. కేవలం 48 రోజుల్లో 6,206 నిర్వాసిత కుటుంబాలకు రూ.768 కోట్ల పరిహారం అందించామని, ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ అదనంగా మరో రూ.169 కోట్లు చెల్లించడమే కాకుండా 18 ఏళ్లు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున సహాయం అందించినట్లు తెలిపారు.

మొదటి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని చెప్పారు. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు లభిస్తుందని, దీంతో పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ కష్టాలు ముగిసిపోతాయని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వెలిగొండ ప్రాజెక్టు కోసం పోరాడిన అమరజీవి పూల సుబ్బయ్య కుమార్తెలు విలాసిని, సునందలను సీఎం వేదికపై సన్మానించారు. తమ తండ్రి ఆశయమైన వెలిగొండను పూర్తి చేసినందుకు పూల సుబ్బయ్య కుమార్తెలు సీఎం చంద్రబాబుకు కాళ్లకు నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు.

గత ప్రభుత్వం రూ.4 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉంచి, సొరంగంలో టీబీఎం యంత్రం ఇరుక్కుపోయినా పనులు పూర్తి చేశామంటూ డ్రామాలు ఆడిందని తీవ్రంగా విమర్శించారు. రూ.1900 కోట్లతో వెలిగొండ ఫేజ్-2 పనులను కూడా 2028 నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని, దక్షిణ భారతదేశంలో గోదావరి-కావేరి నదుల అనుసంధానం జరగాలని ఆకాంక్షించారు. రాబోయే 3 ఏళ్లలో 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేలా క్యాలెండర్ విడుదల చేశామని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.