ఆంధ్రుల జీవనాడి పోలవరంను జగన్ అదోగతి పాలు చేశారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. 20 ఏళ్ల క్రితం వైయస్ శంకుస్థాపన చేసినా ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. మంగళవారం అమరావతిలో ఆమె మీడియాతో మాట్లాడారు. కమీషన్ల కోసం జల యజ్నాన్ని ధన యజ్నంగా మార్చారని ఆరోపించారు. పోలవరాన్ని పరుగులు పెట్టించి 72 శాతం పూర్తి చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని కొనియాడారు. ఒక్క రోజులో 35 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసి గిన్నిస్ రికార్డు సృష్టించారని తెలిపారు. జగన్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని రాచపీనుగులా పీక్కు తిన్నారని మండిపడ్డారు. రివర్స్ టెండరింగ్ పేరుతో కమీషన్లు దండుకుని ప్రాజెక్టును గోదాట్లో ముంచారని తీవ్ర ఆరోపణలు చేశారు.
READ MORE: CBN-PAWAN: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ భేటీ..అసెంబ్లీ సమావేశాలుపై చర్చ
పోలవరం పూర్తైతే 7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరందేదని.. 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్దిరీకరణ అయ్యేదని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ అన్నారు. ఉత్తరాంధ్ర 4 జిల్లాల్లో 48 మండలాలు, 548 గ్రామాలకు తాగునీరు అందేదని.. విశాఖ పారిశ్రామిక హబ్ గా ఎదిగేదని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలు, ఛత్తీస్ గడ్, ఒడిషా కూడా నీళ్లిచ్చేవాళ్లమన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ది చేస్తానని జగన్ రూ. 500 కోట్లతో ప్యాలస్ కట్టుకున్నారని ఆరోపించారు. ఇదేనా మీరు చేసిన ఉత్తరాంధ్ర అభివృద్ధి.. పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేది చంద్రబాబే అని వ్యాఖ్యానించారు.
READ MORE: Nara Lokesh: “2019లో ఈవీఎంలు గొప్పగా పని చేస్తే గెలిచి, ఓడిపోయినప్పుడు నిందిస్తారా?”
కాగా.. సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. హెలికాప్టర్‌లో నుంచి పోలవరం ప్రాజెక్ట్ స్పిల్‌వే సహా వివిధ ప్రాంతాలను వీక్షించారు. సీఎంకు హెలిప్యాడ్ దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్ట్ దగ్గరకు చేరుకున్న చంద్రబాబు.. అధికారుల్ని అడిగి ప్రాజెక్ట్ పనుల్లో పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా ప్రాజెక్ట్ స్పిల్ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పనులపై ఆరా తీశారు. ప్రాజెక్ట్ 22, 23 గేట్ల నుంచి పరిశీలన చేశారు.