NTV Telugu Site icon

Chandrababu: నేడు ప్రధాని మోదీతో చంద్రబాబు కీలక భేటీ.. ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఆసక్తి!

Chandrababu

Chandrababu

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా పొత్తులపై క్లారిటీ తెచ్చుకోవడమే లక్ష్యంగా ఈ భేటీలు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముఖ్యమంత్రి జగన్ సిద్దమవుతున్నారని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం గత ఏడాదిగా జోరుగా నడుస్తోంది. ఇటీవల ఆ ప్రచారం మరింతగా ఎక్కువైంది. ఈ క్రమంలో అనూహ్యంగా చంద్రబాబు హస్తిన పర్యటనకు వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.

Read Also: JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రారంభం

శనివారం హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. శనివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. దాదాపు 40 నిమిషాలపాటు ఈ భేటీ జరగ్గా.. తెలంగాణ, ఏపీ రాజకీయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. విభజన హామీలను నెరవేర్చనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు 2018లో ఎన్డీఏ నుంచి వైదొలిగాక తొలిసారి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం కీలకంగా మారింది. పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధానితో భేటీ కానుండటం కీలకంగా మారింది. ఇవాళ ఉదయం మోదీతో భేటీ ముగిసిన తర్వాత చంద్రబాబు మధ్యాహ్నం ఢిల్లీ నుంచి తిరిగి బయల్దేరనున్నారు. అలాగే నేడు పలువురు కేంద్ర పెద్దలను కూడా కలిసే అవకాశముందని తెలుస్తోంది. గతంలో జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో మోదీతో 5 నిమిషాల పాటు చంద్రబాబు ఏకాంతంగా మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ మోదీతో చంద్రబాబు భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.