Chandrababu CID Custody: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ కొద్ది నిమిషాల్లో ముగియనుంది. సీఐడీ కస్టడీ తర్వాత వర్చువల్ విధానంలో టీడీపీ అధినేత చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు సీఐడీ అధికారులు ప్రవేశపెట్టనున్నారు. కస్టడీ పొడిగింపుపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబును మరో 3 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోర్టును సీఐడీ అధికారులు కోరనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో న్యాయమూర్తి మాట్లాడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో ఏసీబీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ఏసీబీ కోర్టుకు న్యాయమూర్తి చేరుకున్నారు. నేటితో చంద్రబాబు రిమాండ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రిమాండ్, కస్టడీ.. ఈ రెండు అంశాలపై కాసేపట్లో క్లారిటీ రానుంది. చంద్రబాబును శనివారం సీఐడీ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబును దాదాపు 5 గంటల పాటు వివిధ కోణాల్లో ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి కొంత సమాచారం రాబట్టినట్టు సమాచారం. ఇవాళ సుమారు 6 గంటల పాటు అధికారులు విచారణ జరిపినట్లు తెలుస్తోంది. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు ఆధ్వర్యంలో ఈ విచారణ కొనసాగింది.