Adar Poonawalla: గర్భాశయ క్యాన్సర్ చికిత్స కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి వ్యాక్సిన్ సెర్వవాక్ ఉత్పత్తిని వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా వెల్లడించారు. కొవిడ్‌పై దృష్టి సారించిన కారణంగా హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ ఉత్పత్తిని రెండేళ్లపాటు వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2023 ప్రారంభంలో భారత ప్రభుత్వానికి తక్కువ మోతాదులో డోస్ సరఫరా చేయడం ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
గర్భాశయ క్యాన్సర్‌కు కారణమయ్యే హ్యూమన్ పాపిలోమా వైరస్‌ను కట్టడి చేయడంలో ఈ వ్యాక్సిన్ కీలకంగా పనిచేస్తుందన్నారు. ఎగుమతుల కోసం 2024 వరకు వేచి ఉండాల్సిందేనన్నారు. 2024లో యూనిసెఫ్‌తోపాటు ఆఫ్రికా దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తామన్నారు. హెచ్‌పీవీ టీకాలు కొన్ని రకాల గర్భాశయ క్యాన్సర్‌ను నివారిస్తాయని ఆయన వెల్లడించారు. కంపెనీ 150 మిలియన్లకు పైగా డోస్‌ల తయారీ స్థాయిని నిర్మించాల్సి ఉందన్నారు.
Fire Accident: ఢిల్లీలోని బాంక్వెట్ హాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. చెలరేగిన మంటలు
సెర్వవాక్ వ్యాక్సిన్ దేశీయ వినియోగం కోసం ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందిందనన్నారు. దేశీయంగా ప్రారంభించిన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి ప్రీక్వాలిఫికేషన్ పొందాలని భావిస్తున్నామని అదర్ పూనావాలా చెప్పారు. కంపెనీ ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఇండియన్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కూడా చాలా ఆర్డర్‌లను ఇస్తుందని ఆయన తెలిపారు.