AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ తాజా ప్రతిపాదనతో ముందుకొచ్చింది. ఏపీ భవన్ భవనాలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే.. తెలంగాణ విజ్ఞప్తికి పూర్తి భిన్నమైన ప్రతిపాదన చేయడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశం దాదాపు కొలిక్కి వచ్చేసింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ అధికారులతో పలుమార్లు సమావేశమైన కేంద్ర హోం శాఖ.. వాటికి సంబంధించిన మినిట్స్‌ను విడుదల చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 26న కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలను గురువారం విడుదల చేసింది. ఏపీ భవన్‌కు సంబంధించి మొత్తం 19.73 ఎకరాల్లో 12.09 ఎకరాలు ఆంధ్రప్రదేశ్‌కు, 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదించింది. ఏపీ భవన్ విభజనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు, తెలంగాణ ప్రభుత్వం రెండు ఆప్షన్లు ఉన్నాయని తెలిపాయి. అయితే కేంద్రం ఆప్షన్–ఈతో ముందుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదన ఆచరణ యోగ్యంగా ఉందని ఏపీ స్వాగతించిందని కేంద్ర హోంశాఖ పేర్కొంది. కేంద్ర హోం శాఖ సమావేశంలో కేంద్ర సంయుక్త కార్యదర్శులు సంజీవ్‌కుమార్ జిందాల్, జి.పార్థసారధి, ఏపీ ప్రభుత్వం తరఫున కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్, తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు పాల్గొన్నారు.
Read Also: Siddipet Crime: కొడుకులు పంచుకున్నారు.. భరించలేక తన చితికి తానే నిప్పంటించుకున్న తండ్రి
భూములు, భవనాల విభజనపై గతంలో ఆంధ్రప్రదేశ్ మూడు ప్రతిపాదనలు చేసింది. తాజాగా తెలంగాణ మరో ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. గోదావరి, శబరి బ్లాకులు, నర్సింగ్ హాస్టల్ పక్కనే ఉన్న ఖాళీ స్థలం తమకు ఇవ్వాలని తెలంగాణ కోరగా.. కేంద్ర హోంశాఖ మాత్రం పూర్తి భిన్నమైన ప్రతిపాదన చేసింది. 7.64 ఎకరాల పటౌడీ హౌస్‌ను తెలంగాణ తీసుకోవాలని ప్రతిపాదించింది. మిగిలిన 12.09 ఎకరాల ఖాళీ భూమి ఏపీ తీసుకోవాలని ప్రతిపాదించింది. ఆస్తులను 58:42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోవాలని కేంద్రం సూచించింది. దాంతో.. ఏపీ, తెలంగాణ జనాభా నిష్పత్తికి అనుగుణంగా రెండు రాష్ట్రాలకు వాటా దక్కనుంది. ఒకవేళ ఏపీకి అదనపు భూమి దక్కితే.. ఆ ప్రభుత్వం నుంచి భర్తీ చేసుకోవాలని తెలంగాణకు కేంద్ర హోంశాఖ సూచించింది. ఏపీ భవన్‌ను దక్కించుకోవాలని తెలంగాణ సర్కారు ఎంతగానో ప్రయత్నించింది. ఏపీ భవన్‌ను తమకు వదిలేస్తే.. దానికి బదులుగా పటౌడీ హౌస్‌లోని స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని ఏపీ అధికారులను తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరింది. నిజాం నిర్మించిన హైదరాబాద్ హౌస్‌కు ఆనుకొని ఉన్న స్థలంతో భావోద్వేగ సంబంధాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. కానీ.. తెలంగాణ ప్రతిపాదనలకు అంగీకరిస్తే కీలకమైన కూడలిలో ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం, చరిత్ర కనుమరుగు అవుతుందనే వాదనలు తెరపైకి రావడంతో జగన్ సర్కార్ ఆలోచనలో పడింది.