China Pneumonia: చైనాలో న్యూమోనియా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్నాయి. దీనిపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా భారత్ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది. ఇటీవల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో భారత్‌లో వ్యాధి తీవ్రత ఉండదని చెప్పింది. పొరుగు దేశంలో పరిస్థితుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక సూచనలు చేస్తూ లేఖ రాశారు.
Read Also: TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!
రాష్ట్రాలు, యూటీల్లో హాస్పటల్ బెడ్స్, మందులు, ఇన్‌ఫ్లూయెంజా కోసం వ్యాక్సిన్లు, మెడికల్ ఆక్సిజన్, యాంటీబయాటిక్స్, మెడికల్ పరికరాలు, టెస్టింగ్ కిట్స్, వైద్య సదుపాయాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఆక్సిజన్ ప్లాంట్లు, వెంటిలేటర్ల పనితీరు, ఆరోగ్య సౌకర్యాలలో ఇన్ఫెక్షన్ నియంత్రన పద్దతులపై కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖలో పేర్కొంది.
గతంలో కోవిడ్-19 అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సరైన నిఘా వ్యూహాన్ని, కార్యచరణ మార్గదర్శకాలను అమలు చేయాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. ముఖ్యంగా తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధులపై దృష్టి సారించాలని చెప్పింది. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రాజెక్ట్ (IDSP), ముఖ్యంగా పిల్లలు మరియు యుక్తవయసులోని వారిపై జిల్లా, రాష్ట్ర నిఘా విభాగాల ద్వారా శ్వాసకోశ వ్యాధులను నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించింది.